Cyclone updates

Chennai, Dec 5: బురేవి తుపాన్‌ తమిళనాడు రాష్ట్ర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మన్నార్‌ గల్ఫ్‌లో కొనసాగుతున్న బురేవి తుఫాన్‌ (Burevi Cyclone) బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా మారి తమిళనాడులోని (Tamil Nadu) పంబన్‌కు పశ్చిమ నైరుతి దిశలో కొనసాగుతోంది.

ఈ తుపాన్‌ (Burevi Cyclone Live Updates) శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రామనాథపురం మీదుగా దక్షిణ, వాయవ్య దిశగా కేరళ వైపు పయనిస్తూ తీరందాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో కడలూరు, నాగపట్నం, తిరువారూరు జిల్లాల్లో భారీ వర్షాలు, తంజావూరు, పుదుకోట్టై, శివగంగై, విల్లుపురం, తిరువణ్ణా మలై, అరియలూరు, పెరంబలూరు, వేలూరు, తిరువళ్లూరు, రాణిపేట, కారైకాల్‌ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

నాలుగు రోజుల క్రితం బంగాళాఖాతం ఈశాన్యంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా, ఆ తర్వాత బురేవి తుపానుగా రూపాంతరం చెంది శ్రీలంక వైపునకు ప్రయాణించడం ప్రారంభించిన సంగతి విదితమే. అయితే గురువారం మధ్యాహ్నం శ్రీలంకను దాటి పాంబన్‌ ప్రాంతంలో కేంద్రీకృతమై కన్యాకుమారి మీదుగా తీరం దాటుతుందని చెన్నై వాతావరణ కేంద్రం అంచనావేసింది. గురువారం రాత్రే తుపాన్‌ బలపడడం ప్రారంభంకావడంతో రాష్ట్రంలోని దక్షిణ తమిళనాడులోని అనేక ప్రాంతాలు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున రామనాథపురం సముద్ర తీరానికి సమీపంలో బురేవి తుపాను కేంద్రీకృతమైంది. ఈ కారణంగా కన్యాకుమారి జిల్లాకు ఈశాన్యం ప్రాంతంలో 50 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి.

మరో 12 గంటల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, డిసెంబర్ 2న ట్రింకోమలీ వద్ద బురేవి తుఫాన్ తీరం దాటే అవకాశం, తమిళనాడు, ఏపీ, కేరళకు భారీ వర్ష ముప్పు

తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురుస్తాయని పేర్కొన్నారు. దీని ప్రభావంతో మంగళవారం నుంచే భారీ వర్షాలు పడుతాయని, 48 గంటల పాటు దాని తీవ్రత కొనసాగవచ్చని అంచనా వేస్తున్నట్లు పువియరాసన్ చెప్పారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సైతం భారీగా తగ్గుతుందని చెప్పారు. బురేవి తుఫాను ప్రభావంతో శనివారం, ఆది వారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా, తిరుమలలో ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 1,750 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటికే తిరుమలలో అన్ని డ్యామ్‌లు నిండుకుండలను తలపిస్తున్నాయి.

బురేవి తుపాను దెబ్బకు చెన్నై నగరం వరద నీటి చెరువును తలపించింది. చెన్నై శివారు ప్రాంతాలైన తాంబరం సహా అనేక ప్రాంతాల్లోని నివాసగృహాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. నివర్‌ తుపాను కారణంగా ప్రవహించిన నీటి నుంచి బయటపడకముందే బురేవి వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. చెన్నై శివార్లలోని ముడిచ్చూర్‌ పరిసరాల్లోని 20 నివాస ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెన్నైలోని అడయారు, రాయపేట, మైలాపూర్, ఎగ్మూర్, పురసైవాక్కం, గిండి, సైదాపేట ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది.

బురేవి తుపాన్‌ ప్రభావంతో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు తొమ్మిది మందిని బలి తీసుకున్నాయి. లక్ష ఎకరాల్లో పంట వర్షార్పణమైంది. తమిళనాడు రాష్ట్రంలో నివర్‌ తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి నష్టాలను అంచనావేసేందుకు కేంద్ర బృందం శనివారం తమిళనాడుకు చేరుకుంటోంది. తొలి రోజున కడలూరు, విల్లుపురం జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉంది.