Representational Image | (Photo Credits: PTI)

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తమిళనాడు వద్ద తీరం దాటిన తర్వాత క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు (TS Weather Report) కురుస్తాయని తెలిపింది.

అల్పపీడన ప్రభావంతో హైదరాబాదులో నేటి సాయంత్రం జల్లులు కురిశాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మాసాబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. హైదరాబాదుతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు, ఎల్లుండి కూడా వర్షాలు పడతాయని ఐఎండీ (IMD) పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ (IMD issues yellow alert ) జారీ చేసింది.

నగరంలో గత రెండు రోజుల నుంచి అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లో శనివారం వాతావరణం ఒక్కసారిగా  చల్లబడింది.  బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్పపీడన ప్ర‌భావంతో నగరంలో శనివారం సాయంత్రం చిరుజ‌ల్లులు కురిశాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కొనసాగాతాయని హైదరాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది.

తీరం దాటి బలహీనపడిన వాయుగుండం ప్రభావం వల్ల మరికొద్ది రోజులపాటు తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. తీరం వైపు వాయుగుండం వేగం తగ్గుముఖం పట్టడంతో 12 జిల్లాలకు జారీ చేసిన ‘రెడ్‌ అలెర్ట్‌’ను సైతం గురువారం రాత్రి ఉపసంహరించు కున్నట్లు తెలిపారు. అయితే ఈ వాయుగుండం పుదుచ్చేరిని వర్షాలతో ముంచెత్తిందని తెలిపారు. ఈరోడ్‌, సేలం, వేలూరు, తిరువణ్ణామలై, రాణిపేట జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయని వివరించారు.