Deadline to link Aadhaar with PAN extended| Representational Image | (Photo: LatestLY)

New Delhi, April 1: ఆదాయపు పన్ను (ఐటి) విభాగం ఆధార్ తో పాన్ అనుసంధానం చేసుకునే గడువును జూన్ 30 వరకు పొడగించింది. అంతకుముందు, రెండు గుర్తింపు కార్డుల సమాచారాన్ని లింక్ చేయడానికి గడువు మార్చి 31గా ఉండేది. దేశంలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఆధార్ నంబర్ యొక్క సమాచారాన్ని పాన్ కార్డు యొక్క సమాచారంతో అనుసంధానించటానికి 2021 జూన్ 30 వరకు గడువును పెంచుతున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) ఒక ప్రకటనలో తెలిపింది.

పాన్ కార్డును ఆధార్‌ కార్డుతో లింక్ చేయకపోతే పాన్ డియాక్టివేట్ అవుతుందని ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ గతంలోనే స్పష్టం చేసింది.

ఆదాయపు పన్ను విభాగం తన వెబ్‌సైట్‌లోకి వెళ్లి పాన్ కార్డును ఆన్‌లైన్‌లో ఆధార్ నంబర్‌కు సులభంగా లింక్ చేయవచ్చు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ యొక్క అధికారిక వెబ్‌సైట్ - https://www.tin-nsdl.com/ ద్వారా కూడా లింక్ చేయవచ్చు.

పాన్- ఆధార్ లింక్ ఇలా చేయండి:

ముందుగా www.incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి.

హోమ్ పేజీలో ఇ-ఫైలింగ్ ట్యాబ్ పై క్లిక్ చేసి "Link Aadhaar" ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.అందులో మీ ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ నమోదు చేయాలి. అలాగే ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు, ఇతర వివరాలను నింపాలి.

ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Link Aadhaar పైన క్లిక్ చేయాలి.

మీ పాన్‌ కార్డుతో ఆధార్ నెంబర్ వెంటనే లింక్ అవుతుంది.

ఆన్‌లైన్‌లో కుదరకపోతే మరో రకంగా ఎస్ఎంఎస్ ద్వారా కూడా మీ ఆధార్ నెంబర్‌ను పాన్ కార్డుతో లింక్ చేయొచ్చు. ఇందుకోసం సూచించిన ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ పంపాలి. UIDPAN<space><12 అంకెల ఆధార్><space><10 అంకెల పాన్> అని టైప్ చేసి 567678 లేదా 56161 నెంబర్లకు ఎస్ఎంఎస్ పంపాలి.