దేశంలోని వివిధ పుణ్యస్థలాలు, హిస్టోరిక్ ప్రదేశాలకు తీసుకువెళ్లే భారత్ దర్శన్ ప్యాకేజీని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రారంభించింది. ఈ నెల 29 నుంచి ఈ ప్రత్యేక పర్యటన ప్రారంభమై.. వచ్చే నెల 10 వ తేదీ వరకు కొనసాగుతుంది. 11 రాత్రులు/12 పగల్లు ఉండే ఈ ప్రత్యేక ‘భారత్ దర్శన్’ (IRCTC Bharath Darshan) ప్యాకేజీని పెద్దవారికి రూ.11,340 కే అందివ్వనున్నారు. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ (Bharat Darshan Tour Package) కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది.
ఈ ప్రత్యేక పర్యటనలో హైదరాబాద్‌తోపాటు అహ్మదాబాద్, భావ్‌నగర్‌లోని నిష్కలంక్ మహాదేవ్ సీ టెంపుల్, అమృత్‌సర్, జైపూర్, స్టాట్యూ ఆఫ్ యూనిటీ వంటి ప్రదేశాలను తాజాగా చేర్చారు. ఈ ప్రత్యేక పర్యటనలో స్లీపర్ క్లాస్ టికెట్‌తోపాటు కూరగాయల భోజనం, నాన్ ఏసీ ట్రాన్స్‌పోర్ట్, హాల్ అకామడేషన్ వంటి సౌకర్యాలు కల్పిస్తారు. పర్యటనలో పాలుపంచుకోవాలనుకునే వారు తమ టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను (IRCTC) సందర్శించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐఆర్‌సీటీసీ జోనల్, రీజనల్ కార్యాలయాల్లో కూడా బుకింగ్ చేసుకునే వీలున్నది.
ఈ ప్రత్యేక టూర్‌కు వెళ్లే వారికి ట్రావెల్ ఇన్సురెన్స్‌తోపాటు శానిటైజేషన్ కిట్‌ను అందజేస్తారు. మధురై, సేలం, దిండిగల్, ఈరోడ్, జోనారిపెట్టై కరూర్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, నెల్లూరు, విజయవాడల్లో బోర్డింగ్ పాయింట్లు, విజయవాడ, నెల్లూరు, పెరంబూర్, కాట్పాడి, జోలారిపెట్టై , సేలం, ఈరోడ్, కరూర్, దిడిగల్, మధురైలలో డీ-బోర్డింగ్ పాయింట్లు ఏర్పాటుచేశారు. ప్రయాణం ప్రారంభానికి 48 గంటలు ముందుగా కొవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నట్లు ధ్రువీకరణపత్రాన్ని అందజేయాలి. కాబట్టి పర్యాటకులు ప్రయాణ తేదీకి 48 గంటల్లోపు కరోనా పరీక్ష చేయించుకుని, ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టును ఉంచుకోవాలి. ఈ పర్యటన పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్‌టీసీ అందజేయనున్నారు.