ఇండియన్ రైల్వే (Indian Railways) ఈ రోజు దేశవ్యాప్తంగా 163 రైళ్లను రద్దుచేసింది. ఇందులో 115 రైళ్లను పూర్తిగా రద్దు (Indian Railways Cancels 115 Trains)చేస్తున్నామని, మరో 48 సర్వీసులను పాక్షికంగా రద్దు చేస్తున్నామని ప్రకటించింది. ఈ రైళ్లకు సంబంధించి ముందుగానే బుక్‌చేసుకున్న టికెట్లను రద్దు చేస్తున్నామని ఐఆర్‌సీటీసీ (IRCTC) తెలిపింది. కౌంటర్లలో టికెట్లు కొనుగోలుచేసినవారు అధికారులను సంప్రదించాలని సూచించింది. మెయింటెనెన్స్, మౌలికవసతుల పనులలో భాగంగా రద్దు చేసినట్లు ప్రకటించింది.
ఇదిలా ఉంటే ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నది. ఇందులో పలు సింగిల్ వే రైళ్లు కూడా ఉన్నాయి. సికింద్రాబాద్-యశ్వంత్ పూర్ (07151) రైలు సోమవారం రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు గమ్య స్థానానికి చేరుకోనున్నది. యశ్వంత్‌పూర్-సికింద్రాబాద్ (07152) రైలు మంగళవారం సాయంత్రం 5గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు గమ్యస్థానానికి చేరుతుంది. రెండు రైళ్లు కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తిరోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, యెహలంక స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
అలాగే సోమవారం పూర్ణా-తిరుపతి మధ్య సింగిల్ వే స్పెషల్ ట్రైన్ (07633)ను నడుపనున్నట్లు చెప్పింది. రైలు రాత్రి 11.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.10 గంటలకు గమ్యస్థానానికి చేరనున్నది. అలాగే ఈ నెల 12న నర్సాపూర్-తిరుపతి, విజయవాడ-ధర్మవరం మధ్య సింగిల్ వే స్పెషల్ ట్రైన్స్‌ను నడుపనున్నట్లు పేర్కొంది. నర్సాపూర్-తిరుపతి (07130) రాత్రి 8.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 06.45 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందని, విజయవాడ-ధర్మవరం (07131) రాత్రి 11.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.