దేశంలో ప్రముఖ విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతి ఏటా నిర్వహించే జేఈఈ మెయిన్(JEE Main 2023)నోటిఫికేషన్ వచ్చే వారం విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. జేఈఈ మెయిన్ 2023 నోటిఫికేషన్ ఈ వారంలో విడుదల చేసే అవకాశంలేదని, వచ్చే వారంలో (నవంబర్ 30నాటికి) పరీక్ష తేదీలు వెల్లడించే అవకాశం ఉందని సంబంధిత అధికారులు పేర్కొన్నట్టు సమాచారం.
అందుతున్న సమాచారం ప్రకారం.. జేఈఈ మెయిన్ 2023 పరీక్షలు తొలి విడత జనవరిలో, రెండో విడత ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఈనెల 30లోగా నోటిఫికేషన్ వస్తే తొలి విడత పరీక్షకు వెనువెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదలుకానుంది.ఇదిలా ఉంటే జేఈఈ పరీక్షకు సంబంధించి ఇటీవల ఓ ఫేక్ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన నేపథ్యంలో అప్‌డేట్స్ కోసం ఎప్పటికప్పుడు jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇక జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష జనవరిలో జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జనవరి-ఫిబ్రవరిలో ఇతర పరీక్షలు ఉన్నందున రివిజన్‌కు సమయం కుదరదని ఆవేదన చెందుతున్నారు. తొలి విడత జేఈఈ మెయిన్ 2023 పరీక్షను ఏప్రిల్‌లో నిర్వహించాలని ఎన్‌టీఏ అధికారులకు ట్విట్టర్ ద్వారా ట్వీట్లతో విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు #Jeemainsinapril పేరిట హ్యాష్‌టాగ్‌తో వారు ట్వీట్లు చేస్తున్నారు.
గతేడాది తొలి విడత జూన్ 20- 29 తేదీల మధ్య జరగ్గా.. రెండో సెషన్ పరీక్షను జులై 21- 30 తేదీల మధ్య నిర్వహించారు. ఈ రెండు విడతలకు 10.26లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 9,05,590 మంది పరీక్షలు రాసిన విషయం తెలిసిందే.