Newdelhi, April 11: జాతీయ స్థాయిలో (National Level) వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షకు (NEET Exam) దరఖాస్తుల తుది గడువును (Last Date) మూడ్రోజులు పెంచారు. వాస్తవానికి నీట్ దరఖాస్తులకు గడువు ఏప్రిల్ 6తోనే ముగిసింది. అయితే, పలు సమస్యల వల్ల సకాలంలో దరఖాస్తు చేయలేకపోయామని అభ్యర్థులు చేసిన విజ్ఞప్తిని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరిగణనలోకి తీసుకుంది. ఏప్రిల్ 11 నుంచి 13వ తేదీ వరకు నీట్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఏ ప్రకటించింది.
అప్లికేషన్లలో పొరపాట్ల సవరణకు..
ఏప్రిల్ 13వ తేదీ రాత్రి 11.30 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, రాత్రి 11.59 గంటల వరకు ఫీజు చెల్లింపులు చేసుకోవచ్చని వెల్లడించింది. అటు, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు తమ అప్లికేషన్లలో పొరపాట్లను సవరించుకునేందుకు ఎన్టీఏ తాజాగా కరెక్షన్ విండోను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఎప్పుడు ఎలా?
- మే 7న నీట్ పరీక్ష
- మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష
- మొత్తం 13 భాషల్లో నీట్
- తెలుగులోనూ నీట్ రాసే వెసులుబాటు
- పెన్ను, పేపర్ విధానంలో పరీక్ష
- ఎన్టీఏ వెబ్ సైట్ లో హాల్ టికెట్లు, పరీక్ష కేంద్రాల సమాచారం
- మొత్తం 499 నగరాలు, పట్టణాల్లో నీట్ పరీక్ష నిర్వహణ