Padma Awards 2022| Photo: Twitter

New Delhi, September 2: వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలు అందించే పౌరులను గౌరవిస్తూ భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. గ‌ణ‌తంత్య్ర దినోత్స‌వంసంద‌ర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల‌ (పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ) కోసం 2022 ఏడాదికి గానూ ఆన్‌లైన్ నామినేషన్లు/సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. పద్మ అవార్డు నామినేషన్లకు చివరి తేదీ 15 సెప్టెంబర్, 2021గా గడువు విధించింది. పద్మ అవార్డుల నామినేషన్ల కోసం అధికారిక పోర్టల్ https://padmaawards.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరించబడతాయని తెలిపింది.

పద్మ అవార్డులను "ప్రజల పద్మ" గా అభివర్ణించిన కేంద్ర ప్రభుత్వం, మహిళలు, ఎస్సీ/ ఎస్టీలు, దివ్యాంగులు మరియు సమాజానికి నిస్వార్థంగా సేవ చేస్తున్న పౌరులందరూ మరియు వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, ప్రజా జీవితాలు, మొదలగు వాటిలో విశిష్ట ప్రతిభ కనబరిచిన వ్యక్తులు మరియు నిజంగా గుర్తించదగిన విజయాలను గుర్తించి నామినేషన్లు చేయాల్సిందిగా ప్ర‌భుత్వం ఈ సంద‌ర్భంగా అభ్య‌ర్థించింది.

నామినేషన్లలను పైన పేర్కొన్న పోర్టల్‌లో, నిర్ధిష్ఠ ఫార్మాట్‌ల‌లో పొందుపరచాలని, అలాగే అవార్డుకు సిఫారసు చేయబడిన వ్యక్తికి సంబంధించిన వివరాలను కథన రూపంలో గరిష్టంగా 800 పదాల‌లో తెలియజేయడంతో పాటు, ఆ వ్యక్తి యొక్క విశిష్టత‌ మరియు అసాధారణమైన విజయాలు/సేవల‌ను సంబంధిత ఫీల్డ్/క్రమశిక్షణల‌ను స్పష్టంగా పొందుపరచాలని పేర్కొంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో (www.mha.gov.in) 'అవార్డులు మరియు పతకాలు' శీర్షిక కింద కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఇంకా ఏదైనా విచారణ కోసం ఫోన్ నంబర్లు 011-23092421, +91 9971376539, +91 9968276366, +91 9711662129, +91 7827785786 కు కాల్ చేసి వివరాలు పొందవచ్చునని ప్రభుత్వం స్పష్టం చేసింది.