Hyderabad, February 19: హైదరాబాద్ సహా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి కురుస్తున్న అకాల వర్షాలు రాష్ట్రంలో ఉష్ణోగ్రతను తగ్గించాయి. గురువారం రాత్రి నుంచి మొదలైన తేలికపాటి వర్షపాతం, శుక్రవారం ఉదయం కూడా కొనసాగింది. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భోనగిరి తదితర జిల్లాల్లో వర్షపాతం నమోదైంది. రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ విభాగం తెలిపింది.
మరోవైపు, ఈ ఆకస్మిక మార్పు కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాష్ట్రం మీదుగా వీస్తున్న చల్లని తరంగాలు శీతాకాలాన్ని గుర్తుకు తెస్తుంది. చాలా జిల్లాలలో ఫిబ్రవరి 20 వరకు అతి తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల సెల్సియస్ నుండి 17 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చని, గరిష్ట ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల సెల్సియస్ నుండి 34 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
శుక్రవారం నాడు మహారాష్ట్ర మరియు తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 ° C నుండి 8 ° C కంటే తక్కువగా నమోదవుతాయి. ఈ వారాంతంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయి. అయితే రాబోయే 3-4 రోజులలో మైదాన ప్రాంతాల్లో వెచ్చని రాత్రి ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనావేస్తుంది.
IMD Hyderabad Tweet:
NOWCAST WARNING ISSUED BY MET.CENTRE, HYDERABAD: DT. 19-02-2021 AT 0705 HRS
IST: LIGHT TO MODERATE THUNDERSTORM WITH LIGHTNING AND LIGHT TO MODERATE
RAIN LIKELY TO OCCUR IN SOME PARTS IN THE DISTRICTS OF NZB, NRL DURING NEXT
3 HOURS. CC to ABOVE CONCERNED DIST. COLLECTORS. H…
— IMD_Metcentrehyd (@metcentrehyd) February 19, 2021
ఆంధ్రప్రదేశ్ తీరం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలలో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన ఏర్పడిందని వాతావరణ అధికారులు తెలిపారు. శుక్రవారం దక్షిణ తీరంలో ఒకటి లేదా రెండు ప్రదేశాలలో తేలికపాటి నుండి మితమైన వర్షాలు కురుస్తాయి. ఉత్తర తీరం మరియు రాయలసీమలో శనివారం తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు
ఒక్క తెలంగాణ, ఏపీలోనే కాక, మధ్య మరియు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు రాబోయే 24 గంటల్లో వర్షాభావ వాతావరణ పరిస్థితులను కలిగి ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తేమ పరిస్థితితులు మరియు దిగువ ప్రాంతంలో వీస్తున్న బలమైన గాలుల ప్రభావంతో అకాల వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది.
ఈ తేమతో కూడిన బలమైన గాలులు నైరుతి దిశగా కదిలి వచ్చే 24 గంటల్లో ఛత్తీస్‌ఘర్, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడ, విదర్భ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మహే మరియు అంతర్గత కర్ణాటక ప్రాంతాలలో తేలికపాటి నుండి మితమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడా జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.