Hyderabad, June 24: ఆలస్యంగా వచ్చిన నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశమంతా విస్తరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు (Telugu States) ఏపీ (AP), తెలంగాణలను (Telangana) రుతుపవనాలు దాదాపుగా కమ్మేశాయి. ఈ నేపథ్యంలో, భారత వాతావరణ సంస్థ (ఐఎండీ-IMD) ఏపీ, తెలంగాణలకు వర్షసూచన చేసింది. కోస్తాంధ్రలో (Coastal Andhra) నేడు, రేపు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. దేశంలో వడగాలుల ప్రభావం దాదాపు తగ్గిపోయినట్టేనని, వచ్చే 5 రోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని వివరించింది.
తెలంగాణలో ఇలా..
ఇక తెలంగాణలో నేడు, రేపు పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలు, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ఈదురు గాలులు వీచడంతో అక్కడక్కడ చెట్లు నెలకొరిగాయి.