
Hyd, Dec 29: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే పలు ఉద్యోగ నోటిఫికేషన్లను ప్రకటించిన టీఎస్‌పీఎస్పీ తాజాగా గ్రూప్-2 నోటిఫికేషన్‌ను (TSPSC Group 2 Recruitment 2022) విడుదల చేసింది. పలు విభాగాల్లో 783 పోస్టులకు గానూ టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్‌ను రిలీజ్ (group-2 notification released) చేసింది. ఈ నోటిఫికేషన్‌కు జనవరి 18 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఫిబ్రవరి 16వ తేదీగా నిర్ణయించారు.
అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వం 1032 గ్రూప్-2 పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వరుసగా జాబ్ నోటిఫికేషన్లు ఇస్తోంది. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ జారీ అయ్యాయి. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ పూర్తయ్యాయి. ఈ రిజల్ట్స్ కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. గ్రూప్-4 దరఖాస్తుల ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది. వీటితోపాటు హాస్టల్ వార్డెన్, హార్టికల్చర్, వెటర్నరీ, పోలీసు శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
వీటితో పాటుగా విద్య, వ్యవసాయ శాఖలో 276 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇంటర్ విద్యాశాఖలో 91, సాంకేతిక విద్యాశాఖలో 37 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, వ్యవసాయ శాఖలో 148 వ్యవసాయాధికారుల పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు పోటీ పడే అభ్యర్థుల వయస్సు 01-07-2022 నాటికి 18-44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తులను జనవరి 6, 2023 నుంచి జనవరి 27 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు ఆన్‌లైన్‌లో జనవరి 10 నుంచి జనవరి 30, 2023, సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను చూడాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ సూచించారు.