Electric AC Bus (Photo-Twitter)

హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ వెళ్లే ప్ర‌యాణికుల‌కు టీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్ వినిపించింది. ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ ఈ-గ‌రుడ బ‌స్సుల ఛార్జీల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ ప్ర‌క‌టించారు. ప్రారంభ ఆఫ‌ర్ కింద ఈ-గ‌రుడ బ‌స్సుల ఛార్జీల‌ను తగ్గించిన‌ట్లు తెలిపారు. ఈ ఆఫ‌ర్ నెల రోజుల వ‌ర‌కు అందుబాటులో ఉంటుంద‌న్నారు. మియాపూర్ – విజ‌య‌వాడ ఛార్జీ రూ. 830 నుంచి రూ. 760కి, ఎంజీబీఎస్ – విజ‌య‌వాడ ఛార్జీ రూ. 780 నుంచి రూ. 720కి త‌గ్గించిన‌ట్లు పేర్కొన్నారు.

నేటి నుంచే హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు, ప్రతి 20 నిమిషాలకు ఒకటి చొప్పున బస్సు

మంగళవారం హైదరాబాద్‌ మియాపూర్‌లో 10 ఈ -గరుడ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాదిలోగా హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను నడపనున్నారు. 20 నిమిషాలకో ఈ-గరుడ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించారు. హైదరాబాద్‌ నగరం నుంచి నిత్యం 50 వేల మంది విజయవాడ, రాజమండ్రికి ప్రయాణిస్తున్నారని, అందుకే తొలుత ఈ-గరుడ బస్సులను విజయవాడకు నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.