Tirumala Tirupati Temple Updates: భక్తుల కోసం టిటిడి కీలక నిర్ణయం, ఇక నుంచి శ్రీ‌వారి దర్శనం వాయిదా వేసుకునే అవ‌కాశం, బుకింగ్ తేదీ నుంచి సంవత్సరం లోపు ఎప్పుడైన శ్రీ‌వారి దర్శనం చేసుకోవచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్ డేట్స్ ఇవే..
TTD Additional EO Dharma Reddy (Photo-TTD)

Tirupati, July 4: తిరుమల తిరుపతి కౌంటర్ల నిర్వహణలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఈవో ధర్మారెడ్డి ( TTD Additional EO Dharma Reddy) స్పష్టం చేశారు. ప్రస్తుతం టీటీడీలో 165 కౌంటర్లను నిర్వహిస్తున్నామని, టెండర్లు ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెండర్లు పారదర్శకంగా నిర్వహించడంతో గతంలో కంటే రూ.56 లక్షలు తగ్గించామన్నారు. ప్రస్తుతం కౌంటర్లు నిర్వహించే వారు రూ.40 వేలు చెల్లిస్తే స్పాన్సర్‌షిప్ పొందొచ్చని తెలిపారు. త్వరలోనే అన్ని కౌంటర్లకు స్పాన్సర్‌షిప్ వస్తుందని భావిస్తున్నామన్నారు.

టీటీడీ కౌంటర్ల నిర్వహణ టెండర్ల‌లో అవకతవకలు జరిగాయని కొంద‌రు అస‌త్య ప్రచారం చేస్తున్నార‌ని, దాదాపు 18 నెల‌ల్లో ఐదు సార్లు ప్రొఫెషనల్ ఎక్స్ పీరియన్స్ ఉన్న ఏజెన్సీల నుంచి టెండ‌ర్లు ఆహ్వానించి టిటిడి (TTD) నిబంధ‌న‌ల మేర‌కు పార‌ద‌ర్శ‌కంగా ఎంపిక చేసిన‌ట్లు టిటిడి అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి స్ప‌ష్టం చేశారు. టిటిడి (Tirumala Tirupati Devasthanam) భక్తుల సౌకర్యార్థం అనేక కార్యక్రమాలు చేపడుతున్న‌ద‌ని,ఆ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి 176 కౌంటర్లు ఏర్పాటు చేశామ‌న్నారు. ఉచిత దర్శన టికెట్ల జారీకి,టోల్ గేట్ల వద్ద టోకన్ల కేటాయింపునకు, గదుల కేటాయింపునకు, లడ్డూల జారీకి కౌంటర్లు నిర్వహిస్తున్నామ‌ని ఆయన పేర్కొన్నారు.

శ్రీ‌వారి భ‌క్తుల‌కు మ‌రింత పారదర్శక సేవ‌లు: తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వచ్చేభ‌క్తుల‌కు పారదర్శక సేవలు అందించేందుకు టిటిడి కౌంట‌ర్ల‌ను మ‌రింత నైపుణ్యంతో నిర్వ‌హించ‌నున్న‌ట్లు అద‌న‌పు ఈవో తెలిపారు. అందుకోసం ప్రొఫెషనల్ అనుభవం ఉన్న ఏజెన్సీల ద్వారా నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారు. అందులో భాగంగా తిరుమ‌ల‌లోని (Tirumala) ల‌డ్డూ కౌంట‌ర్లలో ఆయ‌న పూజ‌లు నిర్వ‌హించి ఏజెన్సీ సిబ్బందితో ల‌డ్డూ కౌంట‌ర్లలో సేవ‌ల‌ను ప్రారంభించారు.

తిరుమలలో భక్తులకు ఇక వసతి లభ్యత మరింత సులభతరం, శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం సీజే ఎన్వీ రమణ

తిరుమలతిరుపతి దేవస్థానం(టీటీడీ)లో భ‌క్తుల‌కు విశేష సేవ‌లందిస్తున్న ప‌లు కౌంట‌ర్ల‌ను మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా, ప్రొఫెషనల్ గా నిర్వ‌హించే ఏజెన్సీల‌ను టిటిడి ఆహ్వానించింది . వీటిలో బెంగుళూరుకు చెందిన‌ కెవిఎం ఎన్‌ఫో అతి తక్కువ ధరకు టెండ‌రు వేసింది. ఇకపై తిరుమ‌లలోని ల‌డ్డూ కౌంట‌ర్లు, క‌ల్యాణ క‌ట్ట త‌ల‌నీలాలు స‌మ‌ర్పిచే భ‌క్తులకు టోకెన్లు ఇచ్చే కౌంట‌ర్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ద‌ర్శ‌నం టికెట్లు స్కానింగ్ కౌంట‌ర్లు, తిరుప‌తిలోని ఎస్‌ఎస్‌డి కౌంట‌ర్లు, అలిపిరి టోల్‌గేట్ వ‌ద్ద ఉన్న కౌంట‌ర్లు కెవిఎం ఎన్‌ఫో ఏజెన్సీ ద్వారా నిర్వహించనున్నారు.

శ్రీ‌వారి దర్శనం వాయిదా వేసుకునే అవ‌కాశం: ఇక తిరుమ‌ల శ్రీ‌వారి అర్జిత సేవా (వర్చువల్) టికెట్లు (Thirumala Srivari Arjita Seva virtual tickets) క‌లిగిన భక్తుల కోసం టిటిడి కీలక నిర్ణయం తీసుకున్నది. శ్రీ‌వారి దర్శనం వాయిదా వేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్నది. కరోనావ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి జూన్ 30వ తేదీల మ‌ధ్య వ‌ర‌కు వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లు పొందిన భ‌క్తులు బుకింగ్ తేదీ నుంచి సంవత్సరం లోపు శ్రీ‌వారి దర్శనం చేసుకోవ‌చ్చు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని టిటిడి కోరింది.

జూలై 6న రావ‌ణ సంహారం స‌ర్గ‌ల పారాయ‌ణం: ఇక కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని వ‌సంత మండపంలో రామాయ‌ణంలోని యుద్ధ‌కాండ పారాయ‌ణంలో భాగంగా జూలై 6వ తేదీన‌ రావ‌ణ సంహారం స‌ర్గ‌ల పారాయ‌ణం చేయ‌నున్న‌ట్లు టిటిడి అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మ‌రెడ్డి తెలిపారు. వ‌సంత మండ‌పంలో జూన్ 11న ప్రారంభ‌మైన రామాయ‌ణంలోని యుద్ధ‌కాండ పారాయ‌ణంకు ప్ర‌పంచ వ్యాప్తంగా భ‌క్తుల నుంచి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తొంద‌న్నారు.

భక్తులతో పోటెత్తిన తిరుమల, 30 గంటల్లో 60 వేల టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు, అలిపిరి వద్ద భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్‌

ఇందులో భాగంగా జూలై 6న రావ‌ణ సంహారం స‌ర్గ‌ల పారాయ‌ణం సంద‌ర్భంగా వ‌సంత మండ‌పంలో అశోక‌వ‌నాన్ని త‌ల‌పించే సెట్టింగ్‌లు ఏర్పాటు చేయాల‌న్నారు. యుద్ధ‌కాండ‌ 109 నుంచి 114 వ‌ర‌కు ఉన్న 270 శ్లోకాల‌ను పారాయ‌ణం చేస్తార‌ని చెప్పారు. ఇందులో 111వ స‌ర్గ 14వ శ్లోకంలో శ్రీ రామ‌చంద్ర‌మూర్తి రావ‌ణునిపై బాణం ఎక్కు పెట్ట‌డంతో ప్రారంభ‌మై, 19వ శ్లోకంలో వ‌ధించ‌డంతో పూర్త‌వుతుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక హార‌తి కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేయాల‌ని చెప్పారు.

118 మందికి కారుణ్య నియామ‌కపత్రాలు: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లోని వివిధ విభాగాల‌లో విధులు నిర్వ‌హిస్తూ మ‌ర‌ణించిన ఉద్యోగుల కుటుంబ స‌భ్యులకు చెందిన118 మందికి కారుణ్య నియామ‌కపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా టిటిడి ఈవో డా.కె ఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ “సాక్షాత్తు శ్రీవారి చెంత ఉద్యోగం చేయడం పూర్వజన్మ సుకృతమని” అన్నారు.తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి ఈఓ కారుణ్య నియామ‌కపత్రాలు అందజేశారు. వివిధ ప‌రిపాల‌నా ప‌ర‌మైన కార‌ణాల వ‌ల‌న పెండింగ్‌లో ఉన్న కారుణ్య‌ నియామ‌కాలకు ప్ర‌భుత్వ అనుమ‌తితో ఉత్త‌ర్వులు ఇస్తున్నట్టు తెలిపారు. వీరిలో 81 మంది జూనియ‌ర్ అసిస్టెంట్లు, ఒక అసిస్టెంట్‌, 20 మంది ఆఫీస్ స‌బార్డినెంట్స్‌, ఒక డ్రైవ‌ర్‌, ఏడుగురు ఎమ్‌పిడ‌బ్లూ, న‌లుగురు హెల్ప‌ర్లు, ముగ్గురు క్లీన‌ర్లు, ఒక ఫారెస్టు మ‌జ్దూర్‌ ఉన్నట్టు డా.కె ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు.

ఉచిత సేవలకు రాంరాం వార్తలు అబద్దం : భక్తులకు అందించే ఉచిత సేవలకు టీటీడీ రాంరాం చెప్పినట్లు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవాలని టీటీడీ ఖండించింది. ఈ వార్తల ఆధారంగా కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తూ భక్తుల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేయడం బాధాకరం. భక్తులకు అందిస్తున్న ఎలాంటి ఉచిత సేవలకు టీటీడీ మంగళం పలకలేదని స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

– గతంలో ఒక కౌంటర్లో ఒక షిఫ్ట్ కు రూ.12,345 ( జిఎస్టీ కాకుండా) ఉండగా, ప్రస్తుతం రూ 11,402 కే ( జిఎఎస్టీ కాకుండా) టెండరు ఖరారయ్యింది. ఈ టెండర్లు కూడా ఎంతో పారదర్శకంగా నిర్వహించడం జరిగింది.

– టిటిడి అవసరాలకు అనుగుణంగా కౌంటర్ల సంఖ్యను 176 నుంచి 164కు తగ్గించింది.

– భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు వృత్తి నైపుణ్యతకు సంబంధించి వీరికి శిక్షణ ఇచ్ఛాము.

– కౌంట‌ర్ల‌లో ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు ఈ కొత్త విధానం ద్వారా రోటేష‌న్ ప‌ద్ధ‌తిలో రెండు నెలకు ఒక సారి సిబ్బందిని మార్చే వెసులుబాటు ఉంది.

– భక్తుల విశాల ప్రయోజనాలు, మెరుగైన సేవల లక్ష్యంగా టీటీడీ తీసుకున్న నిర్ణయాలు అరకొరగా అర్థం చేసుకుని మీడియా అసత్య ప్రచారాలు చేయడం మంచిది కాదు.

– పత్రికల్లో ప్రచురితమైన అసత్య వార్తల ఆధారంగా కొంత మంది వ్యక్తులు భక్తుల మనోభావాలతో ఆడుకోవడం మానుకుని, విజ్ఞతతో మాట్లాడాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

9 మంది సింహాచలం అప్పన్న వైదికులకు షోకాజ్‌ నోటీసులు

శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో గడిచి జ్యేష్ట ఏకాదిశి రోజున జరిగిన లక్ష్మీనారాయణస్వామి వార్షిక కల్యాణోత్సవంలో అర్చకులు ఆలపించిన గరుడ గజ్జన పాటను మార్ఫింగ్‌ చేసిన ఘటనలో తొమ్మిది మంది వైదికులకు దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. తానే మార్ఫింగ్‌ చేసి ఇన్‌చార్జి ప్రధానార్చకుడికి పంపినట్టు ఇప్పటికే ఓ వేదపండితుడు అధికారుల వద్ద ఒప్పుకున్నట్టు కూడా ప్రచారం జరిగింది. మొత్తం సంఘటనపై ఈవో కొద్ది రోజులుగా విచారణ చేస్తున్నారు. ఈసంఘటనలో మొత్తం తొమ్మిది మంది వైదికులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అందరినుంచి సమాధానం వచ్చినవెంటనే ఈవో తదుపరి చర్యలు తీసుకోనున్నారు. వైదికుల సమాధానం ఆధారంగా విచారించి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై సింహాలచలం దర్శనాలపై కఠిన నిబంధనలు అమలవుతాయని, ఉద్యోగులైనా సరే దర్శనం టికెట్ తీసుకోవాల్సిందేనని ఈవో సూర్యకళ తెలిపారు.