Heavy Rains (Photo-Twitter)

భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నెల 15 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు , ఓ ముస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం రాత్రి నుంచి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు పొర్లిపొంగుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో అనంతపురం నగరాన్ని వరద నీరు ముంచెత్తింది.వరుసగా కురుస్తున్న వర్షాలు అనంతపురం నగరాన్ని చుట్టుముట్టేస్తున్నాయి. ఇదివరకే కురిసిన వర్షాలకు నిండుగానున్న చెరువుల్లో నుంచి నీరు మత్తడి పారుతోంది.

ప్రధానంగా అనంతపురం రూరల్‌ పరిధిలో గల రుద్రంపేట నుంచి అనంతపురం నగరంలోకి వచ్చే చోట నడిమివంక ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రుద్రంపేట, అనంతపురం నగరానికి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 4వ రోడ్డులోని రజక్ నగర్, రంగస్వామినగర్, సీపీఐ కాలనీల్లోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

అనంతపురంను ముంచెత్తిన భారీ వర్షాలు, ఇళ్లలోకి నడుం లోతువరకు నీళ్ళు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు

వరద నీటితో రుద్రంపేట, నడిమివంక, ఆదర్శ్‌నగర్‌ కాలనీలు జలమయమయ్యాయి. అధికారులు దాదాపు 300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రంగస్వామయి నగర్‌లో చిక్కుకున్న కాలనీవాసులను బోట్ల సాయంతో రక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి చంద్రబాబునగర్, దండోరా కాలనీ, ముత్యాలప్ప కాలనీ, ఐదవ రోడ్డు, ఆరవ రోడ్డు, పక్కన ఉన్న కాలనీ నీట మునిగిపోవడంతో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి రాత్రి నుంచి సహాయక చర్యల్లో మునిగి పోయారు. జిల్లా ఎస్పీ ఫకీరప్ప అర్ధరాత్రి నీట మునిగిన ప్రాంతాలను సందర్శించారు. బుధవారం వరద మరింత పెరగడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రతి వార్డులో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసి భోజన వసతిని సమకూర్చారు.

మరోవైపు.. విజయవాడలో రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో, అధికారులు ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్‌ను మూసివేశారు. ఆలయానికి వచ్చే భక్తులు మెట్లు, లిఫ్ట్‌ మార్గాల్లో రావాలని ఈవో భ్రమరాంబ సూచించారు. వాహనాలను కనకదుర్గనగర్‌లో నిలిపివేయాలని ఈవో స్పష్టం చేశారు.