Bengaluru,Oct 3: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Karnataka Bus Accident) చోటు చేసుకుంది. సంఘటనా స్థలంలోనే ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. బెళగావి జిల్లా, రామదుర్గం తాలుకా చించనూరు గ్రామానికి చెందిన 15 మంది కూలీలు ధార్వాడ జిల్లా మోరబ గ్రామంలో కూలీ పనులకు వెళ్లారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి పనులు ముగించుకొని టాటా ఏస్‌లో వస్తుండగా బెళగావి జిల్లా, సవదత్తి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ధార్వాడ రోడ్డులో బొలెరో వాహనం ఢీకొంది. ప్రమాద తీవ్రతకు టాటా ఏస్ నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో ఐదుగురు మహిళలు, చిన్నారి ఘటనా స్థలంలో మృతి చెందారు. సవదత్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే గత వారం గర్భిణిని ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకెళుతుండగా కలబురిగిలో ఘోర ప్రమాదం జరిగిన విషయం విదితమే. ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ లారీని ఢీకొట్టడంతో ఆమెతో సహా ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. కర్ణాటకలోని కలబురిగి (గుల్బర్గా) జిల్లా సవలగి గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.