Mumbai, March 02: టిక్కెట్ లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న వారికి భారీ జరిమానా విధించారు ముంబై రైల్వే (Mumbai Railway) అధికారులు. టిక్కెట్ లేని రైల్వే ప్రయాణికులు నుంచి రూ.100 కోట్ల జరిమానా (Fine ) వసూలు చేసినట్లు ముంబై డివిజన్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వరకు ఈ మొత్తం జరిమానా వసూలు చేసినట్లు తెలిపింది. ఇంత తక్కువ కాలంలో అధిక మొత్తం జరిమానా వసూలు చేసిన డివిజన్‌గా ముంబై (Mumbai) నిలిచింది. గత ఏడాది జరిమానా రూ.60 కోట్లు ఉండగా, ఈ సారి అదనంగా మరో రూ.40 కోట్లు వసూలయ్యాయి. మొత్తం 18 లక్షల మంది టిక్కెట్ లేని ప్రయాణికుల (Passengers) నుంచి ఈ మొత్తం వసూలు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. ముంబై డివిజన్ పరిధిలోని సబర్బన్ రైళ్లతోపాటు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, రెగ్యులర్ రైళ్ల నుంచి ఈ మొత్తం వసూలయ్యాయి.
టిక్కెట్ లేకుండా ప్రయాణించవద్దని హెచ్చరిస్తున్నప్పటికీ, కొందరు నిర్లక్ష్యంగా ఉంటున్నారని, అలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జరిమానాల విషయంలో తమకెలాంటి టార్గెట్లు లేవని, తనిఖీలు చేసి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించేలా చూడటమే తమ లక్ష్యమని టిక్కెట్ చెకర్స్ అంటున్నారు. టిక్కెట్ కొనకుండా ప్రయాణించే వాళ్లు టిక్కెట్ కొనుక్కున్న వాళ్లను రైళ్లలో ఇబ్బంది పెడుతున్నారని, అందువల్లే చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొందరు లోకల్ ఏసీ ట్రైన్లలో కూడా టిక్కెట్ లేకుండానే ప్రయాణిస్తున్నారు. వారి దగ్గరి నుంచి కూడా భారీగానే వసూలు చేశారు.
‘‘ప్రయాణికుల ప్రవర్తనను బట్టి వాళ్లు టిక్కెట్లు తీసుకున్నారో లేదో కనిపెట్టగలం. ఈ విషయంలో మా అనుభవం కూడా ఉపయోగపడుతోంది. దీంతో టిక్కెట్ లేని వాళ్లను సులభంగా కనిపెడుతున్నాం. అయితే, టిక్కెట్ లేని వాళ్ల దగ్గరి నుంచి జరిమానా వసూలు చేయడం మాత్రం చాలా కష్టం’’ అని ప్రీతి అనే ఒక టీసీ చెప్పారు. ముంబై డివిజన్ పరిధిలో 77 రైల్వే స్టేషన్లు ఉండగా, 1,200 టీసీలు పని చేస్తున్నారు.