Nur Sultan, October 01: మనలో చాలా మంది మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతూ పాటలు వినడం, వీడియోలు చూడటం, ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయడం లాంటివి చేస్తుంటారు. అదెంత ప్రమాదకరమో మరోసారి చెప్పే సంఘటన ఇది. ఫోన్ మొబైల్ ఛార్జింగ్ పెట్టి పాటలు వింటుండగా దాని బ్యాటరీ పేలిపోయి ఒక అమ్మాయి చనిపోయిన విషాదకర ఘటన కజఖస్తాన్ దేశంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే, కజఖస్తాన్ (Kazakhstan) దేశంలోని బస్టోబ్ (Bastobe) అనే ఒక గ్రామానికి చెందిన అలువా (Alua Asetkyzy Abzalbek) అనే 14 ఏళ్ళ ఓ పాఠశాల విద్యార్థిని రాత్రి తన బెడ్ పై విశ్రాంతి తీసుకుంటూ మొబైల్ ఫోన్లో పాటలు వింటుంది, అదే సమయంలో ఫోన్ ఛార్జింగ్ కు కనెక్ట్ చేసి ఉంచింది. పడుకునే ముందు ఆ అమ్మాయి, తన మొబైల్ ను దిండు కింద పెట్టుకొని, పాటలు వింటూ అలాగే నిద్రలోకి జారుకుంది. ఉదయం చూసేసరికి విగతజీవిగా మంచంపై పడి ఉంది. ఆమె మొబైల్ బ్యాటరీ పేలిపోయి, ఛార్జర్ కేబుల్ పూర్తిగా కాలిపోయి ఉంది. ఛార్జింగ్ వల్ల మొబైల్ విపరీతంగా వేడెక్కెడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఫోరెన్సిక్ రిపోర్టుల ప్రకారం, మొబైల్ బ్యాటరీ పేలడం వలన ఆమె తలకు తీవ్రగాయాలై చనిపోయినట్లు తేలింది, ఆ అమ్మాయికి తీవ్రమైన కరెంట్ షాక్ కూడా తగిలినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. కాగా, పేలిపోయిన మొబైల్ 'సామ్సాంగ్ ఎస్ 6' అని చెప్తున్నారు, అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
అలువా మృతిచెందటంతో తన తోటి స్నేహితులు బాధను వ్యక్తంచేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. అలియా బెస్ట్ ఫ్రెండ్ అయజాన్, తాను ఇది నమ్మలేకపోతున్నానని చిన్నప్పట్నించి అలువా తన బెస్ట్ ఫ్రెండ్ అని, ఇప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్ లేకుండా పోయిందంటూ బాధపడుతుంది.
ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం, నేడు ప్రతీఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. మొబైల్ ఛార్జింగ్ పెడుతూ వాడకపోవడం మంచిది. చాలా మందికి తమ మొబైల్ రాత్రంతా ఛార్జింగ్ పెట్టే అలవాటు ఉంటుంది. ఈ అలవాటుకు దూరంగా ఉండటం మంచిది. అలాగే మొబైల్ వేడెక్కినపుడు కొద్దిసేపు ఆ ఫోన్ వాడకుండా పక్కకు పెట్టాలి.