Surat, Jan 19: గుజరాత్‌లోని కొసంబా జిల్లాలో సోమవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Gujarat Tragedy) జరిగింది. ట్రక్కు అదుపుతప్పి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కూలీల పైనుంచి దూసుకెళ్లడంతో 15 మంది ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగర (Surat Tragedy) సమీపంలో కిమ్ చార్ రాస్తా (Kim Char Rasta) వద్ద ఫుట్ పాత్ పై 18 మంది నిద్రిస్తున్నారు.
మంగళవారం తెల్లవారుజామున వేగంగా వచ్చిన ట్రాక్టర్ మరో ట్రక్కును ఢీకొట్టడంతో డ్రైవరు నియంత్రణ కోల్పోవడంతో ట్రక్ ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. దీంతో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న 12 మంది అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారిలో ముగ్గురు మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రమాదం నుంచి 9 నెలల చిన్నారి సురక్షితంగా బయటపడినప్పటికీ ఆమె తల్లిదండ్రులు మరణించారు
మృతులంతా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కూలీలని పోలీసులు చెప్పారు. వేగంగా వెళ్తున్న ట్రక్కు ఎదురుగా చెరుకు లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొని అదుపుతప్పి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కూలీల పైనుంచి దూసుకెళ్లిందని కంరేజ్ డివిజన్ డీఎస్పీ సీఎం జడేజా తెలిపారు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై ప్రధాని మోదీతోపాటు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆక్షాంచారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియో ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారు. గుజరాత్ ప్రభుత్వం సైతం బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షలు ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రుపాని ప్రకటించారు. ఘటన చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు.