Ahmedabad, Feb 18: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల (2008 Ahmedabad bomb blast) కేసులో తీర్పు ఇచ్చింది కోర్టు.మొత్తం 49 మంది దోషుల్లో 38 మందికి మరణశిక్ష విధించింది స్పెషల్ కోర్టు. మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
ఈ కేసులో మొత్తం 77 మంది నిందితులను విచారించిన గుజరాత్ స్పెషల్ కోర్టు..49 మందిని దోషులుగా నిర్ధారించగా, సరైన సాక్యాధారాలు లేకపోవడంతో మరో 28 మంది నిర్దోషులుగా ప్రకటించింది. 2008న జూలై 26న గంట వ్యవధిలోనే అహ్మదాబాద్ నగరంలో సుమారు 21 చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో సుమారు 56 మంది మృత్యువాత పడగా, మరో 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి సుధీర్ఘంగా విచారణ జరిగింది.
2008 Ahmedabad serial bomb blast case | A special court pronounces death sentence to 38 out of 49 convicts pic.twitter.com/CtcEWGze2z
— ANI (@ANI) February 18, 2022
నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (SIMI)కి చెందిన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (IM)తో సంబంధమున్న వ్యక్తులే ఈ పేలుళ్లకు పాల్పడ్డారని నిఘా సంస్థలు తేల్చాయి. 2002 గోద్రా అల్లర్లకు ప్రతీకారంగానే ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పూనుకొన్నారని తెలిపాయి.
ఈ కేసుకు సంబంధించి గుజరాత్ పోలీసులు మొత్తం 85 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాలతో 78 మందిపై విచారణ కొనసాగించారు. ఆపై నిందితుల్లో ఒకరు అప్రూవర్‌గా మారడంతో నిందితుల సంఖ్య 77కి తగ్గింది. కాగా నిందితులపై హత్య, నేరపూరిత కుట్ర, చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA) ఆధారంగా కేసులు నమోదు చేశారు.
ఇక డిసెంబర్ 2009లో ప్రారంభమైన ఈ కేసు విచారణ సుదీర్ఘకాలం పాటు కొనసాగింది. గుజరాత్ స్పెషల్ కోర్ట్1,100 మందికి పైగా సాక్షులను విచారించింది. అయితే 2016లో కొంతమంది నిందితులు జైలులో 213 అడుగుల పొడవైన సొరంగం తవ్వి తప్పించుకోవడానికి ప్రయత్నించడం సంచలనం సృష్టించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో 77 మంది నిందితులపై ప్రత్యేక కోర్టు విచారణ ముగించింది. తాజాగా వీరిలో 49 మందిని దోషులుగా తేల్చింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో మరో 28 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.