Premature Baby- Representational image Only | (Photo Credits; Pixabay)

Mumbai, April 2: తల్లి కడుపులో 9 నెలల పాటు సురక్షితంగా ఉన్న ఆ పసిపాపకు బాహ్య ప్రపంచంలోకి వచ్చీ రాగానే ప్రాణాంతక కరోనావైరస్ అంటించిన పాపం మూటగట్టుకున్నారు.  3 రోజుల పసిపాపకు (3-day-old boy) కరోనావైరస్ సోకింది, తల్లికి కూడా కోవిడ్-19 పాజిటివ్ (Coronavirus Positive) గా నిర్ధారణ అయింది. దీంతో  ఆ యువకుడు తన భార్యబిడ్డల పరిస్థితి చూసి తల్లడిల్లిపోతున్నాడు. ఈ హృదయ విదారకమైన ఘటన ముంబైలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, ముంబైలోని చేంబూర్ (Chembur) ప్రాంతంలో నివాసం ఉండే ఓ వ్యక్తి , గర్భవతి అయిన తన భార్యను స్థానిక ఆసుపత్రిలో చేర్పించాడు. మూడు రోజుల క్రితమే ఆ తల్లి ఓ ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ తర్వాత వీరిద్దరినీ ఒక ప్రైవేట్ గదిలో ఉంచారు, అయితే కొద్దిసేపటి తర్వాత, మరొక రోగిని కూడా అదే గదిలో చేర్చారు. అయితే ఆ రోగి ద్వారానే తన భార్యబిడ్డలకు కరోనావైరస్ సోకిందని, ఆ రోగికి కరోనావైరస్ సోకిందనే విషయాన్ని ఆసుపత్రి వర్గాలు దాచి పెట్టాయని బాధితుడు భావోద్వేగంతో చెప్పాడు. ఆ ఆసుపత్రిలో 65 వేల రూపాయలు ఖర్చు చేశాను, అన్ని బిల్లులు కట్టించుకొని నిర్ధాక్ష్యణ్యంగా మమ్మల్ని గెంటివేశారు అని బాధితుడు ఆరోపించారు.

ప్రస్తుతం వీరి కుటుంబాని కస్తుర్బా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. "మెరుగైన వైద్యం అందించి నా బిడ్డను, నా భార్యను, నా కుటుంబాన్ని రక్షించండి, మిమ్మల్ని భిక్షం అడుగుతున్నాను" అంటూ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆ యువ తండ్రి వేడుకోవడం పలువురిని కంటతడి పెట్టిస్తుంది.   10 నెలల చిన్నారికి కరోనావైరస్ పాజిటివ్

ముంబై నగరంలో కరోనావైరస్ విజృంభిస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా చెప్పబడే ధారావి (Dharavi) ప్రాంతంలో రెండవ పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో అతడికి సంబంధించి మరో 23 మందిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. మొత్తం మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఇప్పటికే 350కి చేరువైంది, రాష్ట్రంలో సుమారు 1400 మంది మర్కజ్ కు వెళ్లినట్లు అధికారులు లెక్కలు తేల్చారు, ఇందులో ఇప్పటికే 1,300 మందిని గుర్తించామని, మరో 100 మంది కోసం వెతుకుతున్నామని అధికారులు చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా కేసులు ఈరోజు 2వేలు దాటాయి.