Newdelhi, June 22: నీట్ (NEET), యూజీసీ-నెట్ (UGC-NET) పరీక్ష పేపర్ లీకుల (Paper leaks) అంశం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తున్నది. కేంద్రం వ్యవహారశైలి, లీకులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. దోషులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో లీకుల నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రప్రభుత్వం కొత్త చట్టం అమల్లోకి తెచ్చింది. ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్) యాక్ట్ - 2024ను శుక్రవారం నోటిఫై చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చట్టం చేసినా ఎన్నికల హడావుడి మొదలుకావడంతో అమలు తేదీని ప్రకటించలేదు. తాజాగా ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
శిక్షలు ఇవే..
కొత్త చట్టం ప్రకారం.. ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లు అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్ చేసినా, కంప్యూటర్ నెట్ వర్క్ ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా నేరంగా పరిగణిస్తారు. నిందితులకు 5 నుంచి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, రూ.కోటి వరకూ జరిమానా విధిస్తారు. నిందితులు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్టైతే వారి ఆస్తులను జప్తు చేస్తారు.