New Delhi, oct 28: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రంలోని మోదీ సర్కారు పెద్ద శుభవార్తను ప్రకటించింది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన కమిషన్ (8th Pay Commission) ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ మంగళవారం అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా కేబినెట్ పలు ముఖ్య నిర్ణయాలకు కూడా ఆమోదం తెలిపింది. కొత్త వేతన కమిషన్ చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రంజనా ప్రకాశ్ దేశాయ్ నియమితులయ్యారు. ఆమెతో పాటు కమిషన్‌లో ఒక పార్ట్‌టైమ్ సభ్యుడు, ఒక సభ్య కార్యదర్శి ఉంటారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సవరణ కమిషన్ కాలపరిమితి 2026తో ముగియనుంది. ఈ ఈ నేపథ్యంలో, 2026 తరువాత ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు సవరిస్తే సమయానికి అమలు చేయడానికి ముందుగానే 8వ కమిషన్ ఏర్పాటుకు కేంద్రం ముందుకొచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం ఈ కమిషన్‌పై మంత్రిత్వ శాఖలతో, సిబ్బందితో, ఉద్యోగ సంఘాలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించిన ప్రకారం 8వ వేతన సంఘం ఏర్పాటైన తరువాత, 18 నెలల వ్యవధిలో తన సిఫారసులను సమర్పిస్తుంది. ఈ కమిషన్ సిఫారసులు ఆధారంగా కేంద్రం కొత్త వేతన సవరణ అమలు చేస్తుందని ఆయన తెలిపారు. వేతన కమిషన్ సిఫారసులు సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ఇందులో రక్షణ విభాగం సిబ్బంది, అంతర్గత భద్రతా దళాలు, వివిధ మంత్రిత్వ శాఖలలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ ఉంటారు.
కమిషన్ ప్రధానంగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, జీవన ఖర్చులు, కేంద్ర ప్రభుత్వ ఆదాయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రస్తుత జీతభత్యాలు మరియు పింఛన్ మొత్తాలను సమీక్షించి, ఉద్యోగుల జీవన ప్రమాణం మెరుగుపడేలా కొత్త వేతన నిర్మాణం ఎలా ఉండాలో సిఫారసులు చేస్తుంది. 7వ వేతన కమిషన్ సిఫారసుల ఆధారంగా కేంద్రం 2016లో వేతన సవరణ అమలు చేసిన విషయం తెలిసిందే.
ఆ నిర్ణయంతో సగటున ఉద్యోగుల జీతాలు 23% వరకు పెరిగాయి. ఇప్పుడు 8వ కమిషన్ ద్వారా కూడా ఉద్యోగుల వేతనాల్లో గణనీయమైన పెరుగుదల ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త కమిషన్ ఏర్పాటుతో ఉద్యోగుల మానసిక ఉత్సాహం పెరగడం, పరిపాలనా సామర్థ్యం మెరుగుపడడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని భావిస్తోంది. మరోవైపు పెన్షనర్లకు కూడా పెరిగిన పింఛన్ రూపంలో లాభం దక్కనుంది.
ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, కమిషన్ 18 నెలల లోపలే తన చివరి నివేదికను సమర్పిస్తుందని, ఆ నివేదిక ఆధారంగా 2026 నాటికి కొత్త వేతన సవరణలు అమల్లోకి రానున్నాయని తెలిపారు. ఈ నిర్ణయం కేంద్ర ఉద్యోగుల మధ్య సంతోషాన్ని రేపింది. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, “ఇది చాలా కాలంగా ఎదురుచూసిన మంచి నిర్ణయం. ఉద్యోగుల ఆర్థిక స్థితి బలపడటానికి 8వ వేతన కమిషన్ కీలకం కానుంది” అని పేర్కొన్నాయి.