నకిలీ కోర్టు ఆదేశాలు, పోలీసు, న్యాయ అధికారుల పేర్లను వాడి ప్రజలను మోసం చేసే డిజిటల్ అరెస్ట్ స్కామ్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై కోర్టు స్వయంగా (సుమోటోగా) దృష్టి సారించి,అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. హర్యానాకు చెందిన ఒక సీనియర్ సిటిజన్ దంపతులు ఇటువంటి సైబర్ మోసానికి గురైన తర్వాత సుప్రీంకోర్టుకు లేఖ రాయడంతో ఈ కేసును కోర్టు స్వయంగా తీసుకుంది.
సోమవారం జరిగిన విచారణలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి లతో కూడిన ధర్మాసనం ఈ మోసాల విస్తృతి, అంతర్జాతీయ సంబంధాలపై గంభీరంగా చర్చించింది. జస్టిస్ సూర్యకాంత్ పేర్కొంటూ వివిధ ప్రాంతాల్లో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేరం భారతదేశం మొత్తం వ్యాప్తి చెందింది, అంతేకాకుండా సరిహద్దు దాటి కూడా జరుగుతోంది. కాబట్టి ఈ కేసులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేయాలని మేము భావిస్తున్నామని వ్యాఖ్యానించారు.
భారత అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి కోర్టుకు తెలియజేస్తూ, ఈ మోసాల వెనుక ఉన్న మనీలాండరింగ్ నెట్‌వర్క్‌లు ప్రధానంగా మయన్మార్, థాయిలాండ్, ఆసియా దేశాలలో ఉన్నాయని తెలిపారు. ఈ ముఠాలు విదేశాల్లో కార్యకలాపాలు నడిపి భారతీయ పౌరులను టార్గెట్ చేస్తున్నాయని ఆయన హెచ్చరించారు. గత విచారణలో హర్యానా ప్రభుత్వం, అంబాలాలో నమోదు చేసిన రెండు సైబర్ మోసం కేసులను సీబీఐకి బదిలీ చేయడంపై ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఇదే విషయాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా పరిశీలిస్తోంది.
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు సమర్పించిన వివరాల్లో, సీబీఐ ఇప్పటికే ఇలాంటి కొన్ని కేసుల దర్యాప్తును చేపట్టిందని తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఇది మానవ దోపిడీ, సైబర్ మోసం, ఆర్థిక మోసం.. మూడు రంగాల కలయికతో ఉన్న నేరం. కొంతమంది ఉద్యోగాల పేరుతో విదేశాలకు ఆకర్షించబడతారు, అక్కడ చేరిన తర్వాత వారి పాస్‌పోర్టులు తీసుకొని, ఆన్‌లైన్ ద్వారా డబ్బు సంపాదించాలని బలవంతం చేస్తారు. ఈ విధంగా వారు డిజిటల్ మోసం నెట్వర్క్‌లలో బానిసలుగా మారుతున్నారని వివరించారు.
జస్టిస్ బాగ్చి మాట్లాడుతూ మయన్మార్ నుంచి నడుస్తున్న ఈ సైబర్ ముఠాలు ప్రపంచవ్యాప్త సమస్యగా మారాయి. ఇది కేవలం భారతదేశం సమస్య కాదు. అంతర్జాతీయ మోస శృంఖల అని పేర్కొన్నారు. జస్టిస్ సూర్యకాంత్ సీబీఐ, కేంద్రం వద్ద నుండి వివరాలు కోరుతూ ఈ కేసులు పెరుగుతున్న దృష్ట్యా, సీబీఐ వద్ద తగిన మానవ వనరులు, సాంకేతిక సామర్థ్యం ఉందా తెలుసుకోవాలని అన్నారు. దీనిపై స్పందించిన తుషార్ మెహతా, సీబీఐకి హోం మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైమ్ విభాగం నుండి సాంకేతిక సహాయం అందుతోందని హామీ ఇచ్చారు. జస్టిస్ సూర్యకాంత్ సూచిస్తూ.. పోలీసు వ్యవస్థ వెలుపల అవసరమైతే సైబర్ నిపుణులను నియమించుకునే అవకాశాన్ని సీబీఐ పరిశీలించాలని అన్నారు.
విచారణ ముగింపులో ధర్మాసనం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. తమ పరిధిలో నమోదైన డిజిటల్ అరెస్ట్ మోసం కేసుల వివరాలను సమర్పించాలంటూ ఆదేశించింది. ఈ వివరాలు అందిన తర్వాత ఈ విషయం తదుపరి విచారణ జరగనుంది.