Kurnool Bus Fire Accident (Photo-X)

Kurnool, Oct 24: కర్నూలు జిల్లాలో ఘోర బస్సు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ డీడీ01ఎన్‌9490లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘోర విషాదం చోటు చేసుకుంది. బస్సు ప్రమాద సమయంలో ఇద్దరు డ్రైవర్లు, మరో ఇద్దరు సిబ్బంది, 40 మంది ప్రయాణికులు కలిపి మొత్తం 44 మంది ఉన్నారు. వీరిలో 19 మంది సజీవ దహనం కాగా.. 21 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. డ్రైవర్లలో ఒకరు అక్కడి నుంచి పరారవగా.. మరొకరు పోలీసుల అదుపులో ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో బస్సులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది.

ప్రమాదం ఎలా జరిగింది: వీ కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు హైదరాబాద్ పటాన్ చెరువులోని ప్రధాన ఆఫీసు నుంచి గురువారం రాత్రి 9గంటలకు బయలుదేరింది. బీరంగూడ, గండి మైసమ్మ, బాచుపల్లి ఎక్స్ రోడ్, సూరారం, మియాపూర్ ఆల్విన్ ఎక్స్ రోడ్, వనస్థలిపురం పాయింట్లలో ప్రయాణికులను ఎక్కించుకుని బెంగళూరుకు బయలుదేరింది. శుక్రవారం వేకువ జాము 3 గంటల సమయంలో కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలోకి రాగానే.. ఎదురుగా వెళ్తున్న బైకును వేగంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బైకు పూర్తిగా బస్సు కిందకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో బైకు పెట్రోల్ లీక్ అవడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి. ప్రమాద సమయంలో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉండగా.. 20 మంది వెంటనే అప్రమత్తమవడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

బస్సు ఫిట్‌నెస్‌ పై అనుమానాలు: బస్సు ఫిట్‌నెస్‌ లేకపోవడంతో పాటూ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. బస్సు ఫిట్‌నెస్‌ వ్యాలిడిటీ 2025 మార్చి 31 వరకు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. ప్రమాదంలో ఇప్పటి వరకూ మొత్తం 19 మంది మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. బస్సు ఢీకొనడంతో బైకు డ్రైవర్ కూడా అక్కడికక్కడే చనిపోయినట్లు తెలిసింది.

Here's Kurnool Bus Fire Accident Videos

ప్రమాదం నుంచి బయటపడిన వారు: సత్యనారాయణ (ఖమ్మం), జయసూర్య (మియాపూర్‌), నవీన్‌ (హైదరాబాద్‌), అశోక్‌ (మాడుగుల), కీర్తి (ఎస్‌ఆర్‌ నగర్‌), గుణసాయి (హైదరాబాద్‌), గ్లోరా ఎల్సా (హైదరాబాద్) ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ బస్సు పలుమార్లు ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి. 2024 జనవరి 27 నుంచి 2025 అక్టోబరు 9 వరకు ఈ బస్సు 16 సార్లు ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిసింది. మొత్తం రూ.23,120 ఫైన్లు పెండింగ్‌లో ఉన్నాయి.

బైకర్ మృతి, తల్లడిల్లిన తల్లి: ఈ ప్రమాద ఘటనలో ప్రమాదానికి కారణమైన బైకర్‌ శంకర్‌ చనిపోయాడు. శంకర్‌ను కర్నూలు మండలం ప్రజానగర్‌కు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు.శివశంకర్ మరణంతో అతని తల్లి యశోద, కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ బిడ్డ ఇలా మృతి చెందడం పట్ల విలపిస్తోంది. గ్రానైట్, పెయింటింగ్ పనులు చేసే శివశంకర్ నిన్న తెల్లవారుజామున డోన్ నుంచి బయలుదేరి ఇంటికి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.

బైకర్ మృతి, తల్లడిల్లిన తల్లి:

ఒకే కుటుంబంలో నలుగురు సజీవ దహనం: ఈ ప్రమాదంలో ఒక కుటుంబం మొత్తం సజీవ దహనమైంది. నెల్లూరుకు చెందిన రమేష్‌ సహా అతడి భార్య, పిల్లలు చనిపోయారు. దీంతో, వారి బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోల్లవారిపాలెంకు చెందిన గోళ్ళ రమేష్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. రమేష్ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. వీరంతా హైదరాబాద్ వెళ్లి బెంగళూరు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గొల్ల రమేష్‌ (35), అనూష (30), మన్విత (10), మనీశ్‌ (12) మృతి చెందారు. బంధువులు ఘటనా స్థలికి చేరుకున్నారు.

ఒకే కుటుంబంలో నలుగురు సజీవ దహనం:

ఒక్కొక్కరిది ఒక్కో కథ: ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాము అనే వ్యక్తి బెంగళూరులో ఉంటున్నారు. దీపావళి పండుగను సంగారెడ్డి పటాన్‌చెరులోని కృషి డిఫెన్స్‌ కాలనీలో నివాసం ఉండే తమ బంధువుల ఇంట్లో జరుపుకోవడానికి తన తల్లితో కలిసి వచ్చారు. గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో తల్లీ కొడుకులిద్దరు కావేరి ట్రావెల్స్‌ బస్సులో బెంగళూరుకు బయల్దేరారు. ఈ క్రమంలో చిన్నటేకూరు వద్ద ఓ బైకును ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమయింది. దీంతో తల్లి కొడుకులు సజీవదహనమయ్యారు.

వీడియో ఇదిగో.. పెట్రోల్ డబ్బులు అడిగినందుకు పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి చేసిన కానిస్టేబుల్, చల్లారెడ్డిపాలెం పెట్రోల్ బంకులో ఘటన

యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తకొండూరుకు చెందిన అనూష రెడ్డి.. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నది. దీపావళి పండుగను స్వగ్రామంలో తల్లిదండ్రులతో కలిసి జరుపుకున్న ఆమె.. గురువారం రాత్రి బెంగళూరుకు తిరిగిపయణమయ్యారు. లక్డీకపూల్‌లో కావేరి ట్రావెల్స్‌ బస్సు ఎక్కిన ఆమె కూడా మృతిచెందింది. అనూష మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీవరవుతున్నారు.

బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి: కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్రమంలోనే ప్రధాని కార్యాలయం.. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే, క్షతగాత్రులకు 50వేల తక్షణ సాయం ఇవ్వనున్నట్టు తెలిపింది.

తెలుగు రాష్ట్రాల సీఎంలు, ప్రతిపక్ష నేతలు సంతాపం: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు అగ్ని ప్రమాదంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే ప్రతిపక్ష నేతలు కూడా ఈ ప్రమాదం కలచివేసిందని తెలిపారు. మృతులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఏపీ రవాణా శాఖ క్లారిటీ: ప్రమాదానికి గురైన బస్సు ఫిట్‌గానే ఉందని ఏపీ రవాణా శాఖ వెల్లడించింది. బైక్‌ను బలంగా ఢీకొట్టడం వల్లే మంటలు వచ్చినట్లు తెలిపింది. 2018 మే 2న బస్సును డామన్‌ డయ్యూలో రిజిస్ట్రేషన్‌ చేసినట్లు పేర్కొంది. ఈ బస్సుకు 2030 ఏప్రిల్‌ 30 వరకూ టూరిస్ట్‌ పర్మిట్‌ జారీ అయినట్లు వెల్లడించింది. ఈ బస్సుకు 2027 మార్చి 31 వరకు ఫిట్‌నెస్‌ ఉందని తెలిపింది. 2026 ఏప్రిల్‌ 20 వరకు బస్సుకు ఇన్సూరెన్స్‌ కూడా ఉన్నట్లు వివరించింది. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.