New Delhi, NOV 21: అదానీ గ్రూప్‌నకు కెన్యా సర్కారు షాకిచ్చింది. లంచం ఆరోపణలపై అమెరికాలో గౌతమ్ అదానీపై (Gautam adani) కేసు నమోదైన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్ట్ కాంట్రాక్ట్ సహా, విద్యుత్ సరఫరా లైన్ల కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు (Kenya Cancels Airport and Energy Deals) కెన్యా అధ్యక్షుడు విలియం రూటో గురువారం వెల్లడించారు. విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణానికి పబ్లిక్- ప్రైవేటు భాగస్వామ్యం కింద 30 ఏళ్లకు కెన్యా సర్కారు 736 మిలియన్ డాలర్లకు అదానీ గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి ఇప్పుడు బ్రేక్ పడింది.
మరోవైపు కెన్యాలోని (Kenya) ప్రధాన విమానాశ్రయమైన జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి కోసం అదానీకి అప్పగించేందుకు రంగం సిద్ధం అవ్వగా.. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. దీంతో తాత్కాలికంగా ఈ ప్రాజెక్ట్ నిలుపుదల చేసిన అక్కడి ప్రభుత్వం.. తాజాగా పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. భాగస్వామ్య దేశాల దర్యాప్తు సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రూటో ప్రకటించారు. రవాణా, ఇంధన మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.