New Delhi, DEC 31: స్నిఫర్ డాగ్ (Sniffer Dog ) ఒకటి గర్భం దాల్చి ఇటీవల మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సరిహద్దు భద్రతా దళం (BSF) సీరియస్‌గా తీసుకున్నది. అలా ఎలా జరిగిందో తెలుసుకునేందుకు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించింది. విచారణలో దోషిగా తేలినపక్షంలో ఆ కుక్క కేర్‌టేకర్‌కు (Care taker) శిక్షపడే అవకాశాలు ఉన్నాయి. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో (Bangladesh Border) ఓ స్నిఫర్ డాగ్ సరిహద్దు విధుల్లో ఉన్నది. ప్రధాన చెక్‌పోస్టుల వద్ద బీఎస్‌ఎఫ్ జవాన్లతో పాటు స్నిఫర్ డాగ్‌లను కూడా మోహరించారు. అనుమానాస్పద వస్తువులను పసిగట్టడం ద్వారా వాటిని పట్టుకోవడం వీటి ప్రధాన విధి. సాధారణంగా ఈ శునకాలు గర్భం దాల్చగానే వాసన పసిగట్టడంలో బలహీనంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో విధుల్లో ఉన్న లాల్సీ 43 బీఎన్ అనే ఆడ శునకం తన విధులను నిర్వర్తించకపోయింది.
సరిహద్దు అవుట్‌పోస్ట్‌లో ఉన్న ఈ స్నిఫర్ డాగ్ గర్భం దాల్చడంతో అనుమానాస్పద వస్తువులను పసిగట్టలేకపోతున్నది. గర్భం దాల్చిన విషయం తెలియగానే ఆ కుక్కను అధికారులు ఆర్మీ వెటర్నరీ విభాగానికి అప్పగించారు. కొన్నిరోజుల క్రితం అది మూడు పిల్లలకు జన్మనిచ్చింది.
సరిహద్దులో ఎంతో ముఖ్యమైన విధుల్లో ఉన్న స్నిఫర్ డాగ్ గర్భం దాల్చకూడదనేది బీఎస్ఎఫ్ (BSF) నియమం. అయితే, ఎక్కడో పొరపాటు జరిగి ఆ శునకం గర్భం దాల్చి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయంపై బీఎస్‌ఎఫ్ సీరియస్‌గా ఉన్నది. ఎలా జరిగిందో తెల్సుకునేందుకు బీఎస్‌ఎఫ్ అధికారులు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు. జవాన్ సంరక్షణలో ఉంటున్నప్పటికీ అది మూడు పిల్లలకు జన్మనివ్వడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేర్‌టేకర్ తప్పిదమని విచారణలో తేలితే.. ఆయనకు శిక్ష పడుతుందని అధికారులు చెప్తున్నారు.