Supreme Court of India |(Photo Credits: IANS)

NewDelhi, June 29: దేశంలో అన్ని రాష్ట్రాలూ ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు’ పథకాన్ని (One Nation One Ration Card Scheme) అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. జులై 31లోగా పథకాన్ని ప్రారంభించాలని ఆదేశాలిచ్చింది. వలస కార్మికులు ఎక్కడైనా రేషన్ తీసుకునేందుకు పేర్లను నమోదు చేసుకునేలా ఓ పోర్టల్ ను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పథకంతో వలస కార్మికులు తాము పనిచేసే చోటే రేషన్ ను తీసుకునే వీలు కలుగుతుందని చెప్పింది.

అంజలి భరద్వాజ్, హర్ష్ మందర్, జగ్ దీప్ ఛొకర్ లు వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం నేడు విచారణ చేసింది. కరోనాతో ఆర్థికంగా  చితికిపోయిన వలస కార్మికుల సంక్షేమంపై కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు పలు ఆదేశాలు ఇచ్చింది. మహమ్మారి కొనసాగినంత కాలం వలస కార్మికులకు ఉచితంగా రేషన్ సరుకులు ఇవ్వాలని, కమ్యూనిటీ కిచెన్ సెంటర్లను కొనసాగించాలని రాష్ట్రాలను ఆదేశించింది. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు ఆహార ధాన్యాలను కేటాయించాలని ఆదేశాలిచ్చింది.

దేశంలో కనిష్ఠ స్థాయికి పడిపోయిన కేసులు, తాజాగా 37,566 మందికి కోవిడ్, 56,994 మంది డిశ్చార్జ్, ప్రస్తుతం దేశంలో 5,52,659 లక్షల యాక్టీవ్‌ కేసులు, ముంబైలో సగానికి పైగా పిల్లల్లో కోవిడ్‌ యాంటీబాడీలు

అసంఘటిత రంగ కార్మికులతో జాతీయ డేటాబేస్ రూపకల్పనలో కీలకమైన సాఫ్ట్ వేర్ అభివృద్ధి ఆలస్యమవడాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. జులై 31లోగా సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసి డేటాబేస్ ను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. అందుకు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సహకారం తీసుకోవాలని సూచించింది. కార్మికుల నమోదు కోసం రాష్ట్రాలూ కాంట్రాక్టర్లందరి వివరాలనూ వీలైనంత త్వరగా నమోదు చేయాలని సూచనలిచ్చింది.