New Delhi, October 25: ఆంధ్రప్రదేశ్ లోని గొట్టిపోలు గ్రామంలో పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (Archaeological Survey of India) చేపట్టిన తవ్వకాల్లో 2000 సంవత్సరాల నాటి మహా విష్ణువు విగ్రహం బయటపడింది. ఇది పల్లవుల కాలం నాటిదిగా పురావస్తు శాఖ భావిస్తుంది.
తిరుపతికి తూర్పు వైపు 80 కిలోమీటర్ల దూరంలో నెల్లూరు సమీపాన పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో ఇటుకలతో పేర్చబడిన ఒక భారీ స్థావరానికి చెందిన అనవాళ్లను కనుగొన్నారు. ఆ ప్రదేశంలో విష్ణువు విగ్రహంతో పాటు కొన్ని పురాతనమైన వస్తువులు, అనేక రకాల కుండలు వెలికి తీయబడినట్లు చెప్పారు.
ASI ప్రకారం, బయటపడిన విష్ణువు విగ్రహం రెండు మీటర్ల ఎత్తు ఉండి, నాలుగు చేతులు కలిగి కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖు అలాగే మరో కుడి చేయి వరం ప్రసాదించేలాగా, మరో ఎడమ హస్తం విశ్రాంతిని చూపుతున్నట్లుగా భంగిమలు కలిగి ఉన్నాయని ఈ విగ్రహం ఒక పీఠం నిలుచున్నట్లుగా ఉందని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.
అలాగే బయటపడిన ఇటుకలు దీర్ఘచతురస్రాకారంలో 43-48 సెంటీ మీటర్ల పరిమాణంలో ఉన్నాయి. ఇటుక పరిమాణం మరియు అనుబంధ ఫలితాల ఆధారంగా శాతవాహన లేదా ఇక్ష్వాకు కాలాల నాటి నిర్మాణాలతో పోల్చవచ్చు అని చెప్పారు. లభ్యమైన ఆధారాలు, సముద్ర తీరానికి దగ్గరగా ఉండడాన్ని బట్టి చూస్తే ఈ స్థావరం అప్పట్లో ఒక వాణిజ్య కేంద్రంగా పనిచేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. రోమన్ తరహా ఆంఫోరే (పింగాణి0 వస్తువులు, ద్రవ పదార్థాలు, మధుపానం, అత్తరు లాంటి వర్తకం జరిగి ఉండవచ్చునని అనుకుంటున్నారు. అలాగే ఇది ఒక వ్యూహాత్మక కేంద్రంగా కూడా ఉండవచ్చునని పురావస్తు శాఖ అధికారులు వివరించారు.
ఈ స్థావరానికి 15 కిలోమీటర్ల దూరంలో పూడూరు సమీపంలోని మల్లంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉన్న అనవాళ్లు లభించాయని తెలిపారు. ఈ ప్రాంతంలో కూడా పురాతనమైన రాగి నాణేలు, టెర్రకోట పూసలు, విలువైన రాళ్లతో కూడిన చెవి కమ్మలు.
కొన్ని ఇనుప వస్తువులు, వంటకు ఉపయోగించే నాణ్యమైన పాత్రలు తదితర అమూల్యమైన వస్తువులు బయటపడినట్లు వెల్లడించారు.