Amaravati, Mar 24: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీన రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతు తెలిపింది. రైతాంగ, ఉక్కు ఉద్యమాలకు తమ మద్దతు ( Govt. express solidarity to Bharat Bandh) ప్రకటించింది. ఈనెల 26న ఏపీలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులు బంద్ చేయనున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనను ఉధృతం చేస్తూ మార్చి 26న భారత్ బంద్‌కు (Bharat bandh on March 26) పిలుపునిచ్చారు.
సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ.. ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరగని పోరాటం చేస్తున్న రైతు సంఘాలు నేతలు బుధవారం (మార్చి 10) సమావేశమై.. తదుపరి కార్యాచరణపై చర్చించారు. వ్యవసాయ చట్టాలపై తాము చేస్తున్న ఆందోళన మార్చి 26 నాటికి నాలుగు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో భారత్ బంద్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మార్చి 26న పూర్తి స్థాయిలో భారత్ బంద్ చేపట్టనున్నట్లు రైతు నేత బూటా సింగ్ తెలిపారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా శాంతియుతంగా ఈ బంద్ కొనసాగుతుందని వెల్లడించారు. అదేవిధంగా పెరిగిన ఇంధన ధరలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 25న ట్రేడ్ యూనియన్లతో కలిసి ఆందోళనలో పాల్గొనున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 29న ‘హోలీ కా దహన్’ పేరుతో వ్యవసాయ చట్టాల ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేయనున్నట్లు వెల్లడించారు.
కాగా దేశవ్యాప్తంగా ఈనెల 26న రైతు సంఘాలు, విశాఖ ఉక్కు కార్మికులు తలపెట్టిన భారత్ బంద్‌కు వైఎస్సార్‌సీపీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు (AP government support for the Bharat Bandh) ప్రకటిస్తోందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఇటు రైతులు, అటు కార్మికుల ఆందోళనకు పూర్తిగా సంఘీభావం తెలియజేస్తున్నామని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కేంద్రం చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు శుక్రవారం తలపెట్టిన భారత్ బంద్‌కు వ్యాపార, కార్మిక సంఘాలు, లారీ, గూడ్స్ వాహనాల యాజమానులు, వివిధ వర్గాలు పెద్దఎత్తున మద్దతు ప్రకటించాయన్నారు. అలాగే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు కేంద్రానికి తమ నిరసనను తెలియజేసినప్పటికీ విశాఖ ఉక్కును ప్రైవేట్‌పరం చేస్తామని కేంద్రం ప్రకటించిందని మంత్రి పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో.. విశాఖ ఉక్కు కార్మికులు కూడా అదేరోజు తలపెట్టిన భారత్ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని పేర్ని నాని చెప్పారు. ఆ రోజు అన్ని వర్గాల వారు శాంతియుతంగా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.
అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా తలపెట్టిన భారత్ బంద్‌కు తెలుగు దేశం పార్టీ ఇప్పటికే మద్దతు తెలిపింది. ఈనెల 26న నిర్వహించనున్న బంద్‌కు మద్దతివ్వాలంటూ రైతుసంఘాల సమన్వయ కమిటీ, విశాఖ ఉక్కు పోరాట వేదిక సభ్యులు పార్టీ కేంద్ర కార్యాలయంలో తెదేపా ఎమ్మెల్సీలు టీడీ జనార్దన్, అశోక్‌బాబును కలిసి మద్దతు కోరారు. రైతు సమస్యలపై పోరాటంలో తెదేపా ఎప్పుడూ ముందుంటుందని.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మొదటి నుంచీ తాము వ్యతిరేకిస్తున్నామని గుర్తు చేశారు. బంద్‌కు తమ పార్టీ మద్దతిస్తున్నట్లు స్పష్టం చేశారు.
శాఖ ఉక్కు పోరాట వేదిక, రైతు సంఘాలు తలపెట్టిన ఈ బంద్‌లో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో టీడీపీ వెనకంజ వేయదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.