Ahmadabad, OCT 13: గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. దాదాపు 518 కిలోల కొకైన్‌ను పోలీసులు సీజ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.5వేల కోట్లు ఉంటుందని అంచనా. ఢిల్లీ, గుజరాత్‌లకు చెందిన పోలీసులు అంక్లేశ్వర్‌లోని ఓ కంపెనీలో తనిఖీలు నిర్వహించగా.. ఈ మేరకు భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడినట్లు సమాచారం. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోనూ కేవలం పది రోజుల వ్యవధిలోనే రెండు ఘటనల్లో రూ.వేల కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ను సీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం, గుజరాత్ పోలీసులు ఆదివారం సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి దాదాపు 518 కిలోల కొకైన్‌ను ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 1న స్పెషల్ సెల్ పోలీసులు ఢిల్లీలోని మహిపాల్‌పుర్‌లోని గోదాంలో సోదాలు జరిపి.. 562 కేజీల కొకైన్, 40కిలోల హైడ్రోపోనిక్ మారిజునాను సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో వచ్చిన సమాచారం ఆధారంగా అక్టోబర్ 10న ఢిల్లీలోని రమేశ్ నగర్ ప్రాంతంలోని ఓ షాప్‌లో దాడులు చేసి 208కిలోల కొకైన్‌ను సీజ్ చేసినట్లు పోలీసు వర్గాలు ఇటీవల వెల్లడించాయి. కేవలం 15 రోజుల వ్యవధిలో ఢిల్లీ, గుజరాత్‌లలో దాదాపు రూ.13వేల కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.