Kota, Feb 13: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఐఐటీ జేఈఈకి సిద్ధమవుతోన్న జార్ఖండ్ కు చెందిన మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దేశవ్యాప్తంగా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఎడ్యుకేషన్ హబ్‌లో ఇలాంటి ఘటనలకు చెక్ పెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఈ ఏడాది విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఇది నాలుగోది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్‌కు చెందిన శుభ్ చౌధరీ.. గత రెండేళ్లుగా ఐఐటీ జేఈఈకి సిద్ధమవుతున్నాడు. నిన్న జేఈఈ మెయిన్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ పరీక్షలో తన అంచనాకు తగ్గట్టుగా మార్కులు సాధించలేకపోయాడు. ఫలితాలు చూసుకున్న తర్వాత గదికి వెళ్లాడు. ఈ రోజు ఉదయం సీలింగ్‌కు ఉరేసుకొని వేలాడుతున్న అతడి మృతదేహాన్ని గుర్తించారు. సూసైడ్ నోట్ లేదా మరేదైనా క్లూ కోసం పోలీసులు అతని గదిలో వెతుకుతున్నారు. యువకుడి కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు కోటకు చేరుకున్న తర్వాత శవపరీక్ష నిర్వహిస్తారు.