Coronavirus Outbreak. | (Photo Credits: Pixabay)

Nizamabad Rural, June 14: తెలంగాణలో అధికార పార్టీ నేతలకు కరోనావైరస్ గండం వెటాడుతోంది. మొన్న జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కోవిడ్ నిర్ధారణ కాగా, నేడు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో ఎమ్మెల్యే బాజిరెడ్డి చికిత్స కోసం హైదరాబాద్ ప్రయాణమయ్యారు. ఇప్పటికే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను మరియు అనుచరులను అధికారులు హోం క్వారైంటైన్ చేశారు.

గత నాలుగు రోజులుగా ఎమ్మెల్యే బాజిరెడ్డి జ్వరం, దగ్గు లాంటి లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో ఈయనతో సహా కుటుంబ సభ్యులందరికీ నిన్న కరోనా టెస్టులు నిర్వహించారు. ఇందులో బాజిరెడ్డికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా, ఆయన సతీమణికి మాత్రం నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది.

వారం కిందటే ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి బాజిరెడ్డి ప్రైమరీ కాంటాక్ట్ అయ్యారు. ఈ ఎమ్మెల్యేలు ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు రోజుల క్రితమే ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి పాజిటివ్ నిర్ధారణ కాగా, ఆ తరువాత రోజే ఆయన ఇంట్లోని నలుగురు సభ్యులకు కూడా పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు బాజిరెడ్డికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో అధికార వర్గం పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది.

కరోనా ఉన్నప్పటికీ కూడా నేతలు అనేక అధికారిక కార్యక్రమాల్లో బిజిబిజీగా గడుపుతున్నారు. శనివారం రోజు ఎమ్మెల్యే బాజిరెడ్డి కూడా డిచ్ పల్లి మండలం బీబీపూర్ తాండలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ, కళ్యాణ లక్ష్మీ - షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నేతలు, అధికారులు హాజరయ్యారు.