Ap cm ys-jagan-holds-review-meeting-over-roads-and-buildings-department (Photo-Twitter)

Amaravathi, November 4: ఏపీలో రాజకీయంగా ప్రకంపనలకు కారణమైన ఇసుక సమస్య పైన ముఖ్యమంత్రి అధికారికంగా స్పందించారు. నదుల్లో వరద తగ్గగానే ఇసుక సరఫరా బాగా పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) తెలిపారు. సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌ రోడ్లు, భవనాల శాఖపై సమీక్ష సమావేశం (Review Meeting) నిర్వహించారు. ఇసుక కొరత (Sand Problem) అనేది తాత్కాలిక సమస్య అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. నదులకు 90 రోజులుగా ఊహించని రీతిలో వరద వస్తోందని 265పైగా ఇసుక రీచ్‌ల్లో ప్రస్తుతం 61 మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు.

మిగతా రీచ్‌లన్నీ వరదనీటిలోనే ఉన్నాయని వెల్లడించారు. వరద దృష్ట్యా ఇసుక తీయడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. లారీలు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. ఈ సంధర్భంగా 90 రోజులుగా కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, పెన్నా నదులకు వరద కొనసాగుతుందని సీఎం వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు. నిరంతరం వరదల వల్ల ఇసుక సమస్య వస్తోందన్నారు.

గత ఐదేళ్లుగా ఇసుక మాఫియా నడిచిందని విమర్శించారు. ఈ నెలాఖరు నాటికి ఇసుక సమస్య తీరుతుందని తెలిపారు. తాము అవినీతికి ఆస్కారం లేకుండా ఇసుక సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. పేదలకు మేలు చేసేలా మార్గదర్శకాలు రూపొందించి కి.మీకు రూ. 4.90కు ఎవరైతే ఇసుక రవాణా చేస్తారో వారినే రమ్మన్నామని వివరించారు.

ప్రాధాన్యతా రంగాలకు ఇసుక ఇవ్వడానికి వెంటనే ప్రత్యేక స్టాక్‌ యార్డులు కూడా ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఇసుక వ్యవహారం రాజకీయంగా అధికార విపక్షాల మధ్య రగడకు విమర్శలకు కారణమైన సంగతి అందరికీ తెలిసిందే.

ఇసుక విషయంలో విపక్షాలు రాద్దాంత చేస్తున్నాయనీ ఇసుక సమస్య తాత్కాలికమని అన్నారు. భారీ వర్షాలతో వరద నీరు చేరుకోవటం వల్లనే ఈ రీచ్ లు పనిచేయటంలేదని అన్నారు. వర్షాలు కురవటం,నీరు రావటం రైతులకు, పంటలకు ఎంతో మంచిదనీ..భూ గర్భ జలాలు కూడా పెరుగుతాయని ఈ వరదల వల్ల ఏర్పడిన తాత్కాలిక ఇసుక కొరత నవంబర్ నెలాఖరుల్లా ఇసుక కొరత తీరిపోతుందని భావిస్తున్నామన్నారు.