Arvind Kejriwal Arrested (photo-PTI)

New Delhi, May 7: ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని(Arvind Kejriwal) ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన తన అరెస్టును సవాలు చేస్తూ గతంలోనే సుప్రీం కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరిగింది. ఎక్సైజ్ పాలసీ కేసులోతాజా విచారణలో సుప్రీంకోర్టు బెయిల్ ఆర్డర్ ఇవ్వకపోవడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి మరికొంత కాలం జైల్లోనే ఉండే అవకాశం ఉంది.

అరవింద్ కేజ్రీవాల్ కేసుపై విచారణపై తీర్పును రిజర్వ్ లో ఉంచింది ధర్మాసనం. గురువారం లేదా వచ్చే వారం మళ్లీ విచారణ చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు, మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మే 20 వరకు పొడిగించింది. ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్, జ్యుడీషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగించిన ఢిల్లీ కోర్టు

ఈ రోజు విచారణలో లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని, ఒక‌వేళ మ‌ధ్యంత‌ర బెయిల్‌ను మంజూరీ చేస్తే.. అప్పుడు ఎక్సైజ్ పాల‌సీ కేసుతో లింకున్న ఫైల్స్‌ను కేజ్రీ చూడ‌రాదు అని అత్యున్న‌త న్యాయ‌స్థానం అభిప్రాయ‌ప‌డింది. ఒక‌వేళ బెయిల్ మంజూరీ చేస్తే, అప్పుడు అధికారిక డ్యూటీల‌ను కేజ్రీవాల్ నిర్వ‌ర్తించ‌రాదు అని కోర్టు చెప్పింది. ఫైల్స్ మీద సంత‌కం చేయ‌రాదు అని కోర్టు స్ప‌ష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల వేళ ఓ పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) అభిప్రాయపడింది.

ఇది అసాధారణ పరిస్థితి. అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజలు ఎన్నుకున్న ఓ ముఖ్యమంత్రి. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదు. లోక్‌సభ ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయి. పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించింది. అయితే, సుప్రీం అభిప్రాయాన్ని ఈడీ వ్యతిరేకించింది. ‘‘సీఎం అయినంత మాత్రాన ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించకూడదు.

కేసుల్లో రాజకీయ నాయకులకు మినహాయింపులు ఉండకూడదు. ఇప్పుడు బెయిల్‌ మంజూరు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఇక, ఈ కేసులో కేజ్రీవాల్‌ దర్యాప్తునకు సహకరించలేదు. 9 సమన్లను పట్టించుకోలేదు. అందుకే అరెస్టు చేయాల్సి వచ్చింది’’ అని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది.

అనంతరం కేజ్రీవాల్ తరఫున వాదనలు విన్న ధర్మాసనం.. ‘‘ఒకవేళ ఈ కేసులో మీకు బెయిల్‌ మంజూరు చేస్తే అధికారిక విధులు నిర్వర్తించేందుకు మేం అనుమతించబోం. అలా చేస్తే ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటుంది. బెయిల్‌పై విడుదలైతే ఫైళ్లపై సంతకాలు చేయొద్దు’’ అని తెలిపింది.తొలుత అరెస్టుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా దర్యాప్తులో జరుగుతున్న ఆలస్యంపై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్‌ అరెస్టు ముందు నాటి కేసు ఫైళ్లను సమర్పించాలని ఈడీని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు సంస్థ వాటిని ధర్మాసనం ముందు ఉంచింది.