New Delhi. June 5: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీవాల్.. మధ్యంతర బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. వైద్య పరీక్షలు నిర్వహించుకునేందుకు ఏడు రోజుల పాటు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కేజ్రీవాల్ ఈ పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలని తీహార్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.
కాగా బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకునేందుకు మధ్యంతర బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ అభ్యర్థన చేసుకున్న సంగతి తెలిసిందే. దానిపై ఇప్పటికే వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు ఈరోజుకు వాయిదా వేసింది. ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. జూన్ 19 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగింది. కేజ్రీవాల్‌కి షాక్, ఢిల్లీలో మూడోసారి బీజేపీ క్లీన్ స్వీప్, మొత్తం 7 స్థానాలను గెలుచుకుని ఇండియా కూటమికి షాకిచ్చిన కమల దళం
మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం కోసం చేసిన అభ్యర్థనను అంగీకరిస్తూ.. కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు జూన్ 2న తిరిగి జైలు అధికారుల ముందు లొంగిపోయారు. ఆయన ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్నారు.