New Delhi, March 28: ఢిల్లీ మద్యం విధానం కేసు(Excise policy case)లో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈడీ కస్టడీని మరో నాలుగు రోజుల పాటు న్యాయస్థానం పొడిగించింది.కస్టడీ గడువు ముగియడంతో ఆయనను ఈడీ కోర్టు ఎదుట హాజరుపరిచింది. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్, ఈడీ వాదనలు వినిపించాయి. కేజ్రీవాల్‌ను ఇంకా విచారించేందుకు మరో ఏడు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని అధికారులు కోరగా.. నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. ఏప్రిల్ ఒకటి వరకు కస్టడీని పొడిగిస్తూ తీర్పును వెలువరించింది.
విచారణ సందర్భంగా కేజ్రీవాల్ వాంగ్మూలం ఇస్తూ.. సీబీఐ ఆగస్టు 17, 2022న కేసు నమోదు చేసిందని తెలిపింది. ఈడీ 2022 ఆగస్టు 22న ఈసీఐఆర్ దాఖలు చేసిందని తెలిపారు. నన్ను అరెస్టు చేసినా.. ఇప్పటి వరకు ఏ కోర్టు దోషిగా తేల్చలేదన్నారు. తనను ఎందుకు అరెస్టు చేశారని అడగాలనుకుంటున్నానన్నారు. కేవలం నలుగురి ప్రకటనల్లోనే తన పేరు కనిపించిందని చెప్పారు. ఈడీ కస్టడీలో ఉన్నా ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ కొనసాగుతారు, పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
ఈడీ రూ.100 కోట్ల ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈడీ విచారణ తర్వాతే అసలైన మద్యం కుంభకోణం ప్రారంభమైందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయడమే ఈడీ లక్ష్యమని.. ఈడీ బెదిరింపులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనని ఈ సందర్భంగా కేజ్రీవాల్ అన్నారు.ఢిల్లీ మద్యం విధానం కేసు ‘రాజకీయ కుట్ర’ అని.. దీనికి ప్రజలే సమాధానం చెబుతారని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.
విచారణ సమయంలో కేజ్రీవాల్ తప్పించుకునే ధోరణిలో సమాధానాలు చెబుతున్నారని ఈడీ ఆరోపించింది. తన డిజిటల్ పరికరాల పాస్‌వర్డ్‌లను వెల్లడించలేదని కోర్టుకు తెలిపింది. ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులతో కలిపి విచారించాల్సిన అవసరం ఉందని తెలిపింది. గోవా ఎన్నికలకు హవాలా ద్వారా డబ్బులు వినియోగించారని ఈడీ తెలిపింది. కేజ్రీవాల్ మొత్తం విచారణను గందరగోళానికి గురి చేయాలనుకుంటున్నారని.. ఈ అంశం ఇంకా దర్యాప్తు దశలోనే ఉందని ఈడీ పేర్కొంది. గోవా ఎన్నికలకు రూ.100కోట్ల సొమ్మును ఆమ్ ఆద్మీ పార్టీకి అందినట్లుగా ఈడీ ఆరోపించింది. మొబైల్ డేటాను రికవరీ చేసినట్లు ఈడీ పేర్కొంది. పలు డివైజ్‌లలో ఉన్న డేటాను రికవరీ చేయాల్సి ఉంది పేర్కొంది.