New Delhi, Dec 14: దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల్లో (Vacant at Public Sector Banks) ఈ నెల 1 నాటికి 41,177 ఖాళీలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) తెలియజేశారు. ఒక్క ఎస్బీఐలోనే గరిష్ఠంగా 8,544 ఉద్యోగాలు భర్తీ కావాల్సి ఉందని చెప్పారు. అలాగే పీఎన్‌బీలో 6,743, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6,295, ఇండియన్ ఓవర్‌సీస్ లో 5,112, బీవోఐలో 4,848 ఖాళీలు ఉన్నాయి.
సోమవారం లోక్‌సభకు సమర్పించిన ఓ లిఖితపూర్వక సమాధానంలో మొత్తం 12 పీఎస్‌బీల్లో వివిధ స్థాయిల్లో 8,05,986 కుపైగా స్థానాలున్నాయని, ఇందులో ఆఫీసర్లు, క్లర్కులు, సబ్-స్టాఫ్ హోదాల్లో 41,177 ఖాళీలు ఉన్నాయని వివరించారు. కాగా, ప్రభుత్వ బ్యాంకుల్లో సిబ్బంది కొరత పెద్ద ఎత్తునే ఉందన్న మంత్రి.. ఉద్యోగులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించలేకపోతుండటమే ఇందుకు కారణమని వ్యాఖ్యానించడం గమనార్హం.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీలు ఎక్కువగా ఉండటంతో ఉద్యోగులపై ఒత్తిడి పెరిగిపోయిన విషయం ప్రభుత్వానికి తెలుసా..? అని లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. డిసెంబర్ 1వ తేదీ నాటికి బ్యాంకులకు కేటాయించిన పోస్టుల్లో 95శాతం భర్తీ అయ్యాయని ఆమె వెల్లడించారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు కేటాయించిన 8,05,986 ఉద్యోగాల్లో కేవలం 41,177 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని వివరించారు. మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆఫీసర్, క్లర్క్, సబ్‌స్టాఫ్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయని తెలిపారు.
ఏ బ్యాంకులో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే..
* ఎస్బీఐలో 8వేల 544
* పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 6వేల 743
* సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6వేల 295
* ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 5వేల 112
* బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4వేల 848 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కాగా, గత ఆరేళ్లలో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో మాత్రమే ఒక్క పోస్టు తగ్గించామని, మిగిలిన బ్యాంకుల పోస్టుల్లో ఎటువంటి కోత విధించలేదని కేంద్రమంత్రి వివరించారు. బ్యాంకులు వాటి అవసరాలకు తగినట్లు నియామకాలు చేపడుతున్నాయని కేంద్రమంత్రి క్లారిటీ ఇచ్చారు.