Telangana Floods (Photo Credits: PTI)

Hyderabad, October 15:  హైదరాబాద్‌తో సహా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం నుంచి కుండపోతగా కురిస్తున్న వర్షాల నేపథ్యంలో వరదల్లో గల్లంతై, విద్యుత్ ఘాతానికి గురై, గోడలు కూలి ఇలా వేర్వేరు సంఘటనల్లో కనీసం 32 మంది మృతిచెందారు. ఒక్క జీహెచ్‌ఎంసి పరిధిలోనే 19 మంది వరకు చనిపోయినట్లు నిర్ధారించబడగా అందులో ఐదుగురు ఆచూకీ ఇంకా తెలియరాలేదు.

ఒక్కసారిగా భారీగా వచ్చి చేరిన వరద నీటితో రాజధాని నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి, అనేక కాలనీల్లో రోడ్లపై వరదనీరు ప్రవహిస్తూ పరిస్థితి భీకరంగా తయారైంది. రోడ్లపై పార్క్ చేసిన కార్లు, వాహనాలు ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఒక సంఘటనలో, ఓల్డ్ సిటీలోని బార్కాస్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి నగర రోడ్లపై వేగంగా ప్రవహిస్తున్న నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యం కెమెరాలో చిక్కింది. స్థానికుల సహాయంతో పోలీసులు వారిని రక్షించారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. 32 ఏళ్లలో ఎన్నడూ చూడని రీతిలో నగరవాసులు తొలిసారిగా ఇంతటి భారీ వర్షాలను, ఇంతటి విపత్కర పరిస్థితులను చవిచూశారు. పరిస్థితులు కష్టంగా మారడంతో భారత సైన్యం కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది.

వాతావరణ శాఖ ప్రకారం, గత రెండు వారాల్లో రాష్ట్రంలో సాధారణం కంటే 144% అధిక వర్షపాతం నమోదైంది, రాజధాని హైదరాబాద్ నగరంలో అయితే సాధారణం కంటే 404% అధిక వర్షపాతం నమోదు చేసింది.

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిలిసైలతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 'జరిగిన విధ్వంసానికి, కలిగిన ప్రాణ నష్టానికి నా ఆవేదనను పంచుకున్నాను, ఈ సంక్షోభ సమయంలో దేశ ప్రజలంతా కలిసికట్టుగా తెలంగాణ ప్రజలకు అండగా ఉంటారు' అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.

'భారీ వర్షాల వల్ల ఉత్పన్నమయిన పరిస్థితికి సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ మరియు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ లతో మాట్లాడాను. వారికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని హామీ ఇవ్వబడింది. వరద బాధితుల క్షేమం కొరకై ప్రార్ధిస్తున్నాను' అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.