Atishi (Photo Credits: X/@AtishiAAP)

New Delhi, Sep 17: ఢిల్లీ తరువాత సీఎం ఎవరన్నదానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.మంత్రి అతిశీ (Atishi)ని కొత్త సీఎంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు ఆమె పేరును తాజాగా ప్రకటించింది. ఇవాళ సీఎం కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) నివాసంలో శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఢిల్లీ తదుపరి సీఎంగా అతిశీని కేజ్రీ ప్రతిపాదించారు. కేజ్రీ ప్రతిపాదనకు పార్టీ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. దీంతో ఆమె శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు.

మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ అరెస్టై జైల్లో ఉన్న సమయంలో అతిశీ అన్నీ తానై పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ బాధ్యతలను చక్కదిద్దారు. ప్రభుత్వంలోని మొత్తం 14 విభాగాలకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న ఆమె.. కేబినెట్ మంత్రుల్లో అత్యధిక విభాగాలను కూడా చూస్తున్నారు. విద్య, ఆర్థికం, ప్రణాళిక, పీడబ్ల్యూడీ, వాటర్, పవర్, పౌర సంబంధాలు వంటి కీలక శాఖలను అతిశీ నిర్వహిస్తున్నారు. ఎడ్యుకేషన్‌పై వేసిన స్టాండింగ్ కమిటీకి ఆమె చైర్ పర్సన్‌గానూ పనిచేశారు.

కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఖాళీగా ఉన్న కేసీఆర్ ని ఢిల్లీ సీఎం చేయండి, బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు వీడియో ఇదిగో..

మద్యం విధానం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు గత శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించిన కేజ్రీవాల్‌ 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. న్యాయస్థానం నుంచి న్యాయం దక్కిందనీ, ప్రజల నుంచి న్యాయం జరగాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ప్రజలు తమను నిజాయతీ పరులుగా అంగీకరించేవరకు సీఎం సీటులో కూర్చోబోనని కేజ్రీవాల్‌ చెప్పారు.

ఈ క్రమంలో తదుపరి సీఎం రేసులో పార్టీ కీలక నేతలు ఆతిశీ, సౌరభ్‌ భరద్వాజ్‌, రాఘవ్‌ చద్దా, కైలోశ్‌ గహ్లోత్‌తో పాటు కేజ్రీవాల్‌ సతీమణి సునితా కేజ్రీవాల్‌ పేర్లు వినిపించాయి.తాజాగా అతిశీ పేరును అధినేత ఖరారు చేశారు.