FIR Against Azhar: అజరుద్దీన్‌పై చీటింగ్ కేసు నమోదు, తమను మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయించిన ట్రావెల్ ఏజెంట్, తప్పుడు ఆరోపణలు అని కొట్టిపారేసిన అజర్
File Image of Mohammad Azharuddin | Photo Credits: IANS

Aurangabad, January 23:  టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ ఎంపి , హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజరుద్దీన్ (Mohammad Azharuddin)పై మహారాష్ట్ర (Maharashtra) లోని ఔరంగాబాద్ లో చీటింగ్ కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో ఇద్దరు ముజీబ్ ఖాన్ ( ఔరంగాబాద్), సుధీష్ అవిక్కల్ (కేరళ) లపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ట్రావెల్ ఏజెంట్ (Travel Agent) మహ్మద్ షాదాబ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తనను ఈ ముగ్గురు కలిసి సుమారు రూ. 20 లక్షలు మోసం చేశారని అతడి ప్రధాన ఆరోపణ. అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు.

ట్రావెల్ ఏజెంట్ కథనం ప్రకారం, 2019 నవంబర్ 9 నుంచి 12 మధ్య, సుధీష్ అవికల్ మరియు అజర్ పర్సనల్ సెక్రెటరీ ముజీబ్ ఖాన్ కలిసి తమ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ముంబై-దుబాయ్-పారిస్, పారిస్-టురిన్, టురిన్-పారిస్, టురిన్- ఆమ్‌స్టర్‌డామ్, టురిన్-మ్యూనిచ్-ఆమ్‌స్టర్‌డామ్, పారిస్-దుబాయ్- దిల్లీ, కోపెన్‌హాగన్- ఆమ్‌స్టర్‌డామ్, ఆమ్‌స్టర్‌డామ్-మాంచెస్టర్, ఆమ్‌స్టర్‌డామ్-జాగ్రెబ్ తదితర విదేశీ రూట్లకు అత్యవసరం అని చెప్పి టికెట్స్ బుక్ చేయించారు. ఎక్కువగా బిజినెస్ క్లాస్, అగ్ర విమానయాన సంస్థలలో బుక్ చేసుకున్నారు. సుధీష్ మరియు అజరుద్దీన్ ఈ ప్రయాణాలు చేశారు. టికెట్లకు రూ. 21,45,000 ఖర్చు అయింది. ఆ మొత్తాన్ని నవంబర్ 12న డబ్బు చెల్లిస్తామని చెప్పారు. నవంబర్ 15 వరకు వేచి చూసినా డబ్బు రాలేదు. నవబంర్ 24న సుధీష్ చెక్ పంపిస్తున్నానని చెప్పి, వాట్సాప్ లో ఫోటో పంపించారు. అయితే ఇప్పటివరకు కూడా తమ ఖాతాలో డబ్బు పడలేదని సదరు ట్రావెల్ ఏజెన్సీ ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

మరోవైపు, ఇవన్నీ తప్పుడు ఆరోపణలని అజరుద్దీన్ కొట్టిపారేశారు. తానెవరినీ మోసం చేయలేదని చెబుతూ ట్విట్టర్‌లో ఒక వీడియో షేర్ చేశారు.

Azhar's Statement:

ఇక తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌పై తమ లాయర్లతో సంప్రదిస్తున్నట్లు అజర్ తెలిపారు.  కేవలం డబ్బు కోసమే  ఇలా చేస్తున్నారు. వారి ఆరోపణలు నిరాధారం.  దీనిపై కోర్టుకు వెళతాం. వారిపై పరువు నష్టం దావా వేస్తామని ఆయన స్పష్టం చేశారు.