New Delhi, October 28: ఇండియాకు అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని నవంబర్ 30 వరకు పొడగిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ బుధవారం నిర్ణయించింది. సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి విజృంభించింది. ఈ నెలలో దేశంలో భారీస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై అప్పటికే ఉన్న నిషేధాన్ని అక్టోబర్ 31 వరకు పొడగించారు.
అయితే ఇప్పుడిప్పుడు దేశంలో కొవిడ్ నియంత్రణలోకి వస్తుండగా, ప్రపంచంలోని మిగతా దేశాలలో వ్యాప్తి ఎక్కువగానే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని మరో నెలపాటు అంతర్జాతీయ సర్వీసులపై నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు డీజీసీఎ ప్రకటించింది.
కాగా, అన్ని రకాల కార్గో విమానాలు మరియు ఇప్పటికే షెడ్యూల్ చేయబడిన అంతర్జాతీయ కమర్షియల్ విమాన సర్వీసులకు ఈ నిషేధం వర్తించదని డీజీసీఎ స్పష్టతనిచ్చింది.
Here's the update from DGCA
Suspension on scheduled international commercial passenger services to/from India extended till November 30: Directorate General of Civil Aviation (DGCA) pic.twitter.com/fFRJ5UVVlP
— ANI (@ANI) October 28, 2020
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న కారణంగా ఈ ఏడాది మార్చి 23న ఇండియాకు వచ్చే మరియు ఇండియా నుంచి వెళ్లే అంతర్జాతీయ విమాన సర్వీసులపై డీజీసీఏ నిషేధం విధించింది. అయితే, కొవిడ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పలు దఫాలుగా ఈ గడవును పొడిగిస్తూ వచ్చింది. ఇటీవల విధించిన నిషేధం గడువు అక్టోబర్ 31న ముగియనుండటంతో తాజాగా మరోసారి నిషేధాన్ని పొడిగించింది.
మరోవైపు ఏవిషేషన్ అథారిటీ గత వారం మాట్లాడుతూ, ఈ శీతాకాలం సీజన్ లో వారానికి 12,983 దేశీయ విమాన సర్వీసులకు అనుమతిని ఇచ్చినట్లు తెలిపింది. కొవిడ్ లేనినాటి పరిస్థితులతో పోల్చితే దాదాపు 55 శాతం సర్వీసులను దేశీయ రూట్లలో నడుపుకునేందుకు అవకాశం కల్పించినట్లు విమానయాన అధికారులు వెల్లడించారు.