Bengaluru, August 14: దేశంలో థర్డ్ వేవ్ మొదలయిందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో కోవిడ్ (Coronavirus in Karnataka) ప్రమాదకరంగా మారింది. ఆ రాష్ట్రంలో కరోనా వైరస్ పిల్లలపై పంజా విసురుతోంది. ఆరోగ్య శాఖ అధికారిక సమాచారం మేరకు... గత 11 రోజుల్లో 543 మంది పిల్లలకు ( 543 children infected from Covid-19) కరోనా సోకింది. ఆగస్టు ఒకటి నుంచి 11 వరకు 0–9 ఏళ్లలోపు పిల్లలకు 210 మంది, 10–18 మధ్య 333 మంది వైరస్ బారినపడ్డారు. వీరిలో 270 మంది బాలికలు, 273 మంది బాలురు ఉన్నారు.
ఇదిలా ఉండగా 6–15 ఏళ్ల వయసు మధ్య వారితోపాటు 20 ఏళ్లలోపు టీనేజర్లు, నవజాత శిశువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. గడిచిన 24 గంటల్లో 1,669 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా 1,672 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 22 మంది చనిపోయారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,26,401కు చేరుకోగా 28,66,739 మంది కోలుకున్నారు. 36,933 మంది మరణించారు. 22,703 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
పాజిటివిటీ రేటు 0.98 శాతానికి పెరిగింది. బెంగళూరులో 425 కేసులు, 424 డిశ్చార్జిలు, ఐదు మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 12,32,220కి చేరుకోగా 12,08,097 మంది కోలుకున్నారు. 15,933 మంది మరణించారు. నగరంలో ప్రస్తుతం 8,189 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం 1,69,332 మందికి కరోనా పరీక్షలు చేశారు. 1,47,715 మందికి కరోనా టీకా పంపిణీ చేశారు.
చిన్న పిల్లల్లో కరోనా విషయంపై బీబీఎంపీ ఆరోగ్య కమిషనర్ రణదీప్ మాట్లాడుతూ.. ‘రోజువారీగా నమోదయ్యే కేసులను పరిశీలిస్తుంటే కొంత పెరుగుతున్నట్లు తెలుస్తుంది. కానీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జులై నెలాఖరు నుంచి ఆగస్టు మొదటి వారం వరకు నమోదైన కేసులను పరిశీలించాం. అందులో వైరస్ సోకిన 0-19 మధ్య వయస్సు గలవారు 14% కంటే తక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. వైరస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ఇప్పటివరకూ లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్న చిన్నారులనే గుర్తించాం. చాలా వరకు పిల్లలు ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు. గత 10 రోజుల్లో వైరస్ సోకి ఎవరూ మరణించలేదు’ అని ఆయన స్పష్టం చేశారు.
కర్ణాటక రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆగస్టు 15వతేదీ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ఆర్ అశోకా చెప్పారు. పొరుగు రాష్ట్రాలైన కేరళ, మహారాష్ట్రల నుంచి కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి బెంగళూరుతోపాటు ఇతర జిల్లాల్లో ఆంక్షలు పెడతామని మంత్రి పేర్కొన్నారు. బెంగళూరులో పిల్లల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయ్ నేతృత్వంలో సమావేశం నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. బెంగళూరు నగరంలో కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించే ప్రతిపాదన ప్రభుత్వం ముందు లేదని మంత్రి అశోక చెప్పారు.
కరోనా కట్టడికి కర్ఫ్యూ ఒక్కటే కొలమానం కాదు, లాక్ డౌన్ విధించడం, ఇతర చర్యలు ప్రజలను ప్రభావితం చేస్తాయి, రోగులకు ఔషధాలు ఇవ్వడం ద్వారా కూడా కరోనాను నియంత్రించవచ్చు’’ అని మంత్రి చెప్పారు. మొహర్రం, గణేశ చతుర్థి , రాఘవేంద్ర ఆరాధన వంటి నాలుగు ఐదు పండుగలు వచ్చాయని, కరోనాను నియంత్రించేందుకు ఈ పండుగల సందర్భంగా ఆంక్షలు విధిస్తామని మంత్రి చెప్పారు. పిల్లలకు కరోనా చికిత్స చేసేందుకు వీలుగా పీడియాట్రిక్ వార్డులను ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు.దేవాలయాల్లోకి భక్తులను అనుమతించకపోవడం, రాత్రి కర్ఫ్యూ విధించడం, కార్యక్రమాలు, ఈవెంట్‌లు, వివాహాల్లో ఎక్కువ మంది ప్రజలు పాల్గొనకుండా పరిమితులు విధించడం ద్వారా కరోనాకు అడ్డుకట్ట వేస్తామని మంత్రి అశోక చెప్పారు.