Bengaluru, Sep 20: బెంగుళూరులో తన నగ్న చిత్రాలను ప్రియుడు సోషల్ మీడియాలో పెట్టాడనే కోపంతో ప్రియురాలు అతన్ని ( Girl kills doctor boyfriend) చంపేసింది. తన ముగ్గురు ఆఫీసు మిత్రులతో కలిసి అతన్ని దారుణంగా కొట్టడంతో కోమాలోకి వెళ్లి కొద్ది రోజుల తర్వాత మరణించాడు. బెంగళూరులోని బేగూరు పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. నిందితురాలు ప్రతిభ (26), ఆమె స్నేహితులు సుశీల్, గౌతమ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై నగరానికి చెందిన వికాస్ (27), ప్రతిభ సోషల్ మీడియా ద్వారా మంచి స్నేహితులుగా ఉన్నారు. ఇక ఉక్రెయిన్‌లో వైద్య కోర్సు చదివి వచ్చిన వికాస్ చెన్నైలో డాక్టర్‌గా పని చేసి.. ఆరు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం బెంగళూరుకు వచ్చి మైకో లేఔట్ వద్ద నివాసం ఉంటున్నాడు. బెంగళూరు హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లో ఒక ఆర్కిటెక్ట్ కంపెనీలో ప్రతిభ పని చేస్తోంది. ఇద్దరు పరిచయం తర్వాత ప్రేమగా మారింది. వీరి ప్రేమను ఇరు కుటుంబాల వారు కూడా ఒప్పుకొన్నారు. నవంబర్ నెలలో పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారు.
అయితే ఈ మధ్య ప్రతిభ నగ్న చిత్రాలను (sharing nude pics online) వికాస్ ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అది ప్రతిభ కంటపడింది. దాంతో ప్రతిభ కుటుంబీకులు వికాస్‌తో గొడవ పడ్డారు. ప్రేమించినవాడు మోసం చేశాడని, కుటుంబం ముందు పరువు తీశాడంటూ ఆఫీసులో స్నేహితులైన సుశీల్, గౌతమ్, సూర్యతో గోడు చెప్పుకుంది. ఎలాగైనా అతనికి బుద్ధి చెప్పాలని అందరు కలిసి వారం రోజుల క్రితం వికాస్ గదికి వెళ్లి తీవ్రంగా కొట్టారు.అయితే అతను సృహలో లేకపోవడంతో వారే ఆస్పత్రికి తీసుకెళ్లి ఎవరో కొట్టి పారిపోయారని చెప్పారు. అక్కడ చేర్చుకోకపోవడంతో సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న బాధితుడు ఆదివారం రాత్రి చనిపోయాడు. బేగూరు పొలీసులు కేసు నమోదు చేసుకొని ముగ్గురిని అరెస్టు చేశారు. మరో నిందితుడు సూర్య పరారీలో ఉన్నాడు.