New Delhi, Mar 28: దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తి వేగాన్ని పెంచడానికి వ్యాక్సిన్ తయారీ సంస్థలైన భారత్ బయోటెక్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) (Bharat Biotech, Serum Institute ) కేంద్రాన్ని నిధులు కోరాయి. కొవాగ్జిన్‌ను తయారు చేస్తున్న హైదరాబాద్ సంస్థ భారత్ బయోటెక్ రూ.100 కోట్లు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరగా.. అటు తమకు కూడా కొవిడ్ సురక్షా పథకం కింద నిధులు మంజూరు చేయాలని ఎస్ఐఐ కూడా అడిగింది.
ప్రస్తుతం భారత్ బయోటెక్ నెలకు 40 లక్షల కొవాగ్జిన్ డోసులను ఉత్పత్తి (Covid vaccine production) చేస్తోంది. ఇప్పటికే కేంద్రం నియమించిన అంతర్‌మంత్రిత్వ కమిటీ ఒకటి కొవాగ్జిన్ ఉత్పత్తిని పరిశీలించింది. అటు పుణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మార్చి నెలఖరులోపు 10 కోట్ల డోసుల కొవిషీల్డ్ తయారీని పూర్తి చేయనుంది. ఆ కమిటీ సీరమ్‌ను కూడా పరిశీలించింది.
రెండు కంపెనీలు కొవిడ్ సురక్షా పథకం ద్వారానే ప్రభుత్వం నుంచి నిధులు కోరుతున్నాయి. ఈ పథకం కింద వ్యాక్సిన్ తయారీదారులకు నిధులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ రేణు స్వరూప్ చెప్పారు. కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధి, పరిశోధన కోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. గతేడాది నవంబర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఇండియాలో ప్రస్తుతం సీరమ్‌కు చెందిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ను వ్యాక్సినేషన్ కోసం వాడుతున్నారు. ఇప్పటికే సుమారు ఆరు కోట్ల డోసులు వ్యాక్సిన్లను దేశ ప్రజలకు అందించారు. అటు కొవాగ్జిన్‌ను ముంబైలోనూ తయారు చేయడానికి టెక్నాలజీ బదిలీ కోసం ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అదే జరిగితే ముంబైలోని హఫ్‌కినేలో కొవాగ్జిన్‌ను తయారు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రూ.154 కోట్లు అవసరమవుతాయి. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో 45 ఏళ్లు పైబడిన వాళ్లందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వ్యాక్సిన్లకు కూడా డిమాండ్ పెరిగింది.