Bhopal, May 15: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగిపై అక్కడి వార్డ్ నర్స్ అత్యాచారానికి (COVID-19 patient raped by male nurse ) ఒడిగట్టాడు. పరిస్థితి విషమించడంతో ఘటన జరిగిన 24 గంటల్లోనే ఆమె కన్నుమూసింది. కాగా బాధితురాలిని 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన నుంచి బయటపడిన 43 ఏళ్ల మహిళగా గుర్తించారు.
కోవిడ్ -19 చికిత్స కోసం 43 ఏళ్ల మహిళను భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో (Bhopal Memorial Hospital) చేర్చారు. ఆమెపై కన్నేసిన కామాంధుడు ఏప్రిల్ 6న ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి ఈ వార్త బయటకు రాలేదు. ఇప్పుడు ఈ వార్త బయటకు వచ్చింది. ఆస్పత్రిలోని ఓ వైద్యుడికి తన పట్ల జరిగిన ఘోరాన్ని బాధితురాలు చెప్పుకొంది. ఆమె చెప్పిన వివరాలన్నీ ఆ వైద్యుడు రి కార్డు చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితురాలి ఆరోగ్యం విషమించడంతో ఆ మరుసటి రోజే ఆమె కన్నుమూసింది.
బాధితురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా నిందితుడిని 40 ఏళ్ల సంతోష్ అహిర్వార్‌గా (Santosh Ahirwar) గుర్తించి అదే రోజు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను తొక్కిపెట్టేందుకు ఆస్పత్రి నిర్వాహకులు ప్రయత్నించారని.. ఇందులో భాగంగానే బాధితురాలి కుటుంబసభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది. అయితే.. భోపాల్ గ్యాస్ (Bhopal Gas Tragedy) దుర్ఘటన నాటి బాధితులు, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి ఒత్తిడి చేయడంతోనే వెలుగులోకి వచ్చిందని అంటున్నారు.
నిందితున్ని భోపాల్ సెంట్రల్ జైలులో ఉంచారు మరియు ప్రస్తుతం విచారణ కోసం ఎదురు చూస్తున్నారు. అహిర్వార్ ఇంతకుముందు 24 ఏళ్ల స్టాఫ్ నర్సుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, గతంలో డ్యూటీలో ఉన్నప్పుడు మద్యపానం చేసినందుకు సస్పెండ్ చేయబడ్డాడని ఎన్డిటివి తెలిపింది. కాగా బాధితురాలు పోలీసులకు ఒక దరఖాస్తును సమర్పించినట్లు సీనియర్ పోలీసు అధికారి ఇర్షాద్ వలీ మీడియాకు సమాచారం ఇచ్చారు, ఆమె గుర్తింపును బహిర్గతం చేయవద్దని మరియు దర్యాప్తును రహస్యంగా ఉంచమని వారిని అభ్యర్థించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భద్రతను పెంచడానికి అన్ని COVID-19 వార్డులలో సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది.