Canberra, Feb 17: ఆస్ట్రేలియాలో రెండేళ్ల క్రితం ఏకంగా పార్లమెంట్ హౌజ్‌లో, స్వయంగా ఒక మహిళా మంత్రి కార్యాలయంలో ఒక ఉద్యోగినిపై అత్యాచారం (Sexual abuse in Parliament) చేసిన ఘటన అక్కడ కలకలం రేపుతోంది. రక్షణ మంత్రి లిండా రేనాల్డ్స్ కార్యాలయంలో 2019 మార్చిలో పేరు తెలియని సహచర ఎంపీ ఒకరు తనపై అత్యాచారం (Australia parliament rape scandal) చేశాడని ప్రభుత్వ మాజీ ఉద్యోగిని బ్రిటనీ హిగిన్స్ ఆరోపించారు. అదే ఏడాది ఏప్రిల్ లో తను పోలీసులతో ఈ విషయమై మాట్లాడానని, అయితే తన కెరీర్ కి భంగం కలుగుతుందని భావించి ఫిర్యాదు చేయలేదని ఆమె తెలిపింది. పోలీసులు కూడా ఈ విషయాన్నీ ధృవీకరించారు.
ప్రధాని మారిసన్ అధికార లిబరల్ పార్టీకి చెందిన ఆ ‘రేపిస్టు’ పేరును మాత్రం ఆమె చెప్పలేదు. కాగా దీనిపై స్పందించినప్రధాని స్కాట్ మారిసన్ (PM Scott Morrison) ఆమెకు అపాలజీ చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిస్తామన్నారు. పార్లమెంటు వంటి చోట్ల, ఇతర ప్రాంతాల్లో మహిళల భద్రత, రక్షణకు తాము చర్యలు తీసుకుంటామన్నారు. వర్క్ ప్లేస్ లో వచ్ఛే ఈ విధమైన ఫిర్యాదుల సమీక్షకు ప్రధానమంత్రి కార్యాలయం లో కేబినెట్ అధికారి అయిన స్టెఫానీ ఫాస్టర్ ఇక పై విచారిస్తారన్నారు. జరిగిన ఘటన పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.
2019లో ఈ ఘటన జరిగిందని, ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్తినప్పటికీ తనకు బాస్ అయిన మంత్రి లిండా రేనాల్డ్స్ నుంచి కానీ, సహోద్యోగుల నుంచి కానీ న్యాయం పొందేందుకు తగిన సహకారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లనే పోలీస్ కంప్లయింట్‌పై ముందుకు వెళ్లలేదని వివరించారు. లిండా రేనాల్డ్స్‌కు హిగిన్స్ మీడియా సలహాదారుగా పనిచేశారు. ఉద్యోగం పోతుందేమోనన్న భయంతో ఆ అత్యాచారంపై అధికారికంగా పోలీసులకు కంప్లయింట్ ఇవ్వలేదని తాజా ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు.
కాగా మారిసన్ నేతృత్వంలోని లిబరల్ పార్టీలో పలువురు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారని అనేకమంది మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ విధమైన ఆరోపణలు గతంలో చాలా వచ్చాయి. పార్లమెంట్ హౌజ్ పని సంస్కృతిలో తీసుకురావాల్సిన మార్పులపై, ఉద్యోగినుల భద్రతపై సూచనలు చేసేందుకు ప్రధాని కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఘటన గురించి తెలిసిన తరువాత కూడా రేనాల్డ్స్‌ను మంత్రిగా కొనసాగించడంపై విపక్షాలు మోరిసన్‌పై విమర్శలు గుప్పించాయి.