MLA Challa Dharma Reddy: మళ్లీ వివాదంలో చిక్కుకున్న పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, ఆ కులం ఆఫీసర్లకు అక్షరం ముక్కరాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు, క్షమాపణలు చెబుతూ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని వెల్లడి
TRS MLA Challa Dharma Reddy (Photo-Twitter)

Hyderabad, Feb 2: ఇప్పటికే వివాదంలో నలిగిపోతున్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. రాముడి పేరిట బీజేపీ నేతలు దొంగ బుక్కులు తయారుచేసి చందాలు వసూలు చేస్తున్నారని చేసిన వ్యాఖ్యల దుమారం చల్లారక ముందే మరోసారి ఆయన (MLA Challa Dharma Reddy) వెనుకబడిన కులాలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘ఆ కులం ఆఫీసర్లకు అక్షరం ముక్కరాదు.. ఎక్కడ చూసినా వాళ్లే.. మొత్తం నాశనం చేస్తున్నారు’ అంటూ హన్మకొండలో ఆదివారం జరిగిన ఓసీ జేఏసీ సభలో కొన్ని కులాలను ఉద్దేశించి ధర్మారెడ్డి (TRS MLA Challa Dharma Reddy) వ్యా ఖ్యానించారు.

దీనిపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ సంఘాలు భగ్గుమన్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం ధర్మారెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశాయి. కుల సంఘాల ఆగ్రహంతో (backward castes) ఎమ్మెల్యే.. యూ టర్న్‌ తీసుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవి కావని, ఒకవేళ ఎవరి మనసునైనా నొప్పిస్తే వెనక్కి తీసుకుంటూ క్షమాపణ చెబుతున్నానని ధర్మారెడ్డి అన్నారు.

ఎమ్మెల్యే ధర్మారెడ్డి తీరు సరికాదు: చిన్న కులాలను అవమానించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీరు గర్హనీయమని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌ గౌడ్, ఎమ్మార్పీఎస్‌ నేత పుట్ట రవి, లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్‌సింగ్‌ నాయక్‌ పేర్కొన్నారు. ఆయనకు రాజ్యాంగంపై ఏ మాత్రం గౌరవమున్నా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

హన్మకొండలో తీవ్ర ఉద్రిక్తత, టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లు విసిరిన బీజేపీ నేతలు, వివాదాస్పదమైన ఎమ్మెల్యే అయోధ్య రామాలయం వ్యాఖ్యలు

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి కేసులో వరంగల్‌ జిల్లా కోర్టు నిందితులకు రిమాండ్‌ విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 43 మందికి ఈనెల 15వరకు రిమాండ్‌కు ఆదేశించింది. దీంతో నిందితులను వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఈ కేసులో ఏ-1గా భాజపా వరంగల్‌ అర్బన్‌ అధ్యక్షురాలు రావు పద్మ. ఏ-2గా వరంగల్‌ రూరల్‌ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌ ఉన్నారు.

అయోధ్య రామాలయ నిర్మాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై భాజపా నేతలు, కార్యకర్తలు దాడి చేసిన నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. కాగా, ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తల‌ దాడికి నిరస‌న‌గా టీఆర్‌ఎస్‌ పార్టీ పరకాల పట్టణ బందుకు పిలుపునిచ్చింది.