Hyderabad, Jan 31: అయోధ్య రాముడి పవిత్రతను బీజేపీ అపవిత్రం చేస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన విమర్శలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దేవుని పేరుతో అకౌంట్ బులిటీ లేకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నారని ఆయన ఆరోపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మారెడ్డి ఇంటిని ముట్టడించారు. రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. ఈ రాళ్ల దాడిలో ఎమ్మెల్యే ఇంటి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. బీజేపీ నేతలు రావు పద్మారెడ్డి, శ్రీధర్‌తో పాటు 56 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై దాడిని నిరసిస్తూ బీజేపీ కార్యాలయంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి (BJP Activists Attack on TRS MLA House) చేశారు. చల్లా ధర్మారెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి ఎర్రబెల్లి పరామర్శించారు. మరోవైపు పోలీసులు అప్రమత్తమయ్యారు. ధర్మారెడ్డి ఇంటిని వరంగల్ సీపీ ప్రమోద్‌కుమార్ పరిశీలించారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.
తన ఇంటిపై జరిగిన దాడిని ధర్మారెడ్డి (Parakala MLA's Challa Dharma Reddy) తీవ్రంగా ఖండించారు . విరాళాలకు లెక్కా పత్రాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తే నా ఇంటిపై దాడి చేస్తారా అంటూ ధర్మారెడ్డి (TRS MLA Challa Dharma Reddy) మండిపడ్డారు. బీజేపీ నేతలు మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాముడు బీజేపీ నేతలకే దేవుడు కాదని….భారతీయులందరికి ఆరాధ్య దైవమేనన్నారు. హన్మకొండలోని ధర్మారెడ్డి ఇంటి పై జరిగిన దాడి ఖండిస్తూ టీఆర్‌ఎస్ శ్రేణులు పరకాలలో ధర్నా నిర్వహించారు. బిజెపి దిష్టి బొమ్మ తగలబెట్టారు. బిజెపి నాయకుల దౌర్జన్యాలు అరాచకాలు నశించాలని నినాదాలు చేశారు.
Here's BJP Activists Attack on TRS MLA House Video
Amidst chants of #JaiShriRam, #BJP cadres pelt stones at the #Hanamkonda residence of #TRS MLA Challa Dharma Reddy. Recently, the Parkal MLA questioned why should people of #Telangana donate for a temple in #Ayodhya when there was already a Ramalayam in Bhadrachalam. #Warangal pic.twitter.com/5n3We9a9do
— krishnamurthy (@krishna0302) January 31, 2021
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయో లెక్కలు తేలాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రామమందిరం నిర్మాణానికి డబ్బులు వసూలు చేయవలసి అవసరం ఏముందన్నారు. రాముడిగుడికి విరాళాల సేకరణకు అకౌంట్ బులిటీ లేదన్నారు. రాముడు అందరి వాడు హిందువైనా ప్రతి వారు రాముని పూజిస్తారని, రామ మందిరం నిర్మాణం కోసం దొంగ పుస్తకాలు తయారు చేసి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.ప్రపంచంలోనే ఎత్తైన వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహానికి రూ.2,900 కోట్లు పెట్టిన కేంద్ర ప్రభుత్వం అయోధ్య రామమందిరం కోసం రూ.11 కోట్లు పెట్టలేదా అని ధర్మారెడ్డి ప్రశ్నించారు.
భద్రాద్రి ఆలయ ఉన్నటువంటి 1000 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు అప్పగించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రామ మందిరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 1100 కోట్ల రూపాయలు కేటాయించలేదా అని అన్నారు. బీజేపీ వాళ్లే హిందువులే కాదు మేము కూడా హిందువులమే అన్నారు. బీజేపీ నేతలు రామాలయం పేరుతో తెలంగాణలోనే వెయ్యి కోట్లు వసూలు చేస్తే.. మరి 29 రాష్ట్రాల్లో 29వేలకోట్లు ఏం చేస్తారో చెప్పాలని ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. కొద్దిరోజుల క్రితమే టీఆర్ఎస్‌కు చెందిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు రామ మందిరం వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు.
ధర్మారెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టిన బీజేపీ నేతలు హన్మకొండలోని ఆయన ఇంటి దగ్గర ఆందోళనకు దిగారు. ఈక్రమంలోనే కొందరు ఆందోళనకారులు ఆయన ఇంటిపై రాళ్లు, టమాటాలు, కోడి గుడ్లు విసిరారు. ఆందోళనకారుల దాడిలో ఇంటి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసమయ్యాయి. పరిస్థి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు.
ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ దాడిని ఖండిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. ధర్మారెడ్డిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు, నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా దయాకర్‌రావు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ కండువాలు కప్పుకున్న దుండగులు తమపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులపై కూడా దాడులు చేశారని తెలిపారు. తాము దాడులు చేయదలిస్తే ఒక్కరు కూడా మిగలరని ఎర్రబెల్లి హెచ్చరించారు. ఇప్పటికైనా బీజేపీ గుండాయిజం ఆపాలన్నారు. విరాళాల లెక్కలు చెప్పమని అడగడం తప్పా అని ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. ధర్మారెడ్డి ఇంటిపై దాడిపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో మే1 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు, షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ దాడిని ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రామాలయ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని తెలిపారు. విరాళాల సేకరణకు విశ్వహిందు ప్రతినిధులే వస్తారని ప్రకటన చేశారని, కానీ ఇక్కడ విరాళాల సేకరణ సరిగా లేదని ప్రశ్నించినందుకు దాడి చేస్తారా? అని కడియం శ్రీహరి ప్రశ్నించారు.
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ దాడిని మంత్రి కేటీఆర్ ఖండించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏ మాత్రం చోటు లేదన్నారు. బీజేపీ తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని కోరారు. గతంలోనూ బీజేపీ భౌతిక దాడులకు ప్రయత్నించిందని, టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అన్న విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. బీజేపీ కుట్రలను రాష్ట్ర ప్రజలు గమనించాలని కేటీఆర్ కోరారు.
ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి తప్పు పట్టారు. ఆయన ఓ కాంట్రాక్టర్ మైండ్ సెట్‌తో మాట్లాడుతున్నారని అన్నారు. ట్రస్ట్ ద్వారా రామ మందిరం నిర్మిస్తున్నారని.. అయోధ్య నుంచి వచ్చిన బుక్కుల ద్వారానే విరాళాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. విరాళాల సేకరణను కూడా రాజకీయ చేయడం దుర్మార్గమన్నారు. రాజకీయాల్లోకి దేవుడ్ని లాగడం..కానుక రూపంలో డబ్బులు కాజేయడమే బీజేపీ నేతలు పనిగా పెట్టుకున్నారనేది ఎమ్మెల్యే ధర్మారెడ్డి వాదన. కాదు దేవుళ్లకు కూడా ప్రాంతీయతత్వం అంటగట్టి..టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లబ్ధి పొందాలని చూస్తున్నారనేది బీజేపీ నేతల ఆరోపిస్తున్నారు.