Telangana Covid Vaccination: తెలంగాణలో వ్యాక్సిన్ తీసుకున్న తరువాత మరొకరు మృతి, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే ఆరోగ్యం క్షీణించిందని బంధువులు ఆరోపణ, ప్రభుత్వం తరఫున ఇంకా రాని అధికారిక ప్రకటన
Vaccine | Representational Image | (Photo Credits: Flickr)

Hyderabad, Jan 31: కరోనావైరస్ మహమ్మారి నియంత్రణ కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో (Telangana Covid Vaccination) కొన్ని విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్ వల్ల చనిపోయారని ఆరోపణలు రాగా, తాజాగా మరో అంగన్‌వాడీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల జిల్లా, కాసిపేట మండలం, ముత్యంపల్లి గ్రామానికి చెందిన అంగన్‌వాడీ ఆయా (Telangana anganwadi worker) సుశీల ఈ నెల 19న మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ (coronavirus vaccination in mancherial) తీసుకుంది.

అప్పటినుంచి జ్వరం వస్తుండటంతో ఆసుపత్రిలో చూపించుకుంది. అయినప్పటికి జ్వరం తగ్గక శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారటంతో 28న మంచిర్యాలలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరింది. అక్కడ పరిస్థితి విషమించటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. వైద్యుల సలహా మేరకు శనివారం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున ఆమె మరణించింది.

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్‌కేర్‌ వర్కర్‌ మృతి

ఆమె మృతిపై ఆమె బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగురాలు కూడా అయిన సుశీల.. గత వారం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే ఆరోగ్యం క్షీణించిందని వారు చెబుతున్నారు. ఈ ఘటనపై జిల్లా వైద్య అధికారులు స్పందించారు. సుశీలకు దీర్ఘకాలిక వ్యాధులు ఉండడం వల్లనే ఇబ్బంది కలిగి ఉంటుందని మెడికల్‌ ఆఫీసర్‌ కిరణ్మయి అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై ప్రభుత్వం తరఫున అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

వ్యాక్సిన్ తీసుకున్న ఆశ కార్యకర్తకు బ్రెయిన్‌ డెడ్‌

టీకాల సేఫ్టీపై అనుమానాలు తెలంగాణలో వ్యాక్సిన్ కారణంగా ఆరోగ్య కార్యకర్తలు చనిపోయారనే అనుమానాలు వ్యక్తం కావడం ఇది మూడోసారి. తొలుత.. నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఒలా గ్రామానికి చెందిన 108 అంబులెన్స్ డ్రైవర్ విఠల్ రావు, గత వారం వరంగల్ అర్బన్ జిల్లా శాయంపేటకు చెందిన అంగన్‌వాడీ హెల్త్ వర్కర్ వనిత, ఇప్పుడు మంచిర్యాల జిల్లాకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్త సుశీలల మరణాలకు వ్యాక్సినే కారణమనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం మాత్రం మరణకారణాలను నిర్ధారించలేదు. రాష్ట్రంలో శనివారం నాటికి ప్రభుత్వ, ప్రైవేటు వారియర్లు అంతాకలిపి 1,68,589 మందికి టీకాలు వేశారు.