Telangana CM KCR | Photo: CMO

Hyderabad, Jan 27: తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) రిపోర్టు (PRC Report in TS) బుధవారం విడుదలైంది. ఈ రిపోర్టులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7.5 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు చేయాలని పీఆర్సీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని సూచించింది. ఉద్యోగుల క‌నీస వేత‌నం రూ. 19 వేలు ఉండాలని, గ‌రిష్ట వేత‌నం 1,62,070 వ‌ర‌కు ఉండొచ్చ‌ని సిఫార‌సు చేసింది.

గ్రాట్యుటీ ప‌రిమితి రూ. 12 ల‌క్ష‌ల నుంచి రూ. 16 ల‌క్ష‌ల‌కు.. శిశు సంర‌క్ష‌ణ సెలవులు 90 నుంచి 120 రోజుల‌కు పెంచింది. సీపీఎస్‌లో ప్ర‌భుత్వ వాటా 14 శాతానికి పెంచాల‌ని పీఆర్సీ సిఫార్సు చేసింది. 2018 జులై 1వ తేదీ నుంచి వేత‌న స‌వ‌ర‌ణ అమ‌లు చేయాల‌ని క‌మిష‌న్ సిఫార్సు చేసింది. కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఈ సాయంత్రం ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధుల‌తో చర్చలు జరపనుంది. ఈ మేరకు తొలిరోజు టీఎన్జీవో, టీజీవో సంఘాలకు ఆహ్వానం పంపింది.

ఇదిలాఉంటే వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) (Pay Revision Commission report) నివేదికను తెలంగాణ సర్కారు ఇవాళ విడుదల చేసిన నేపథ్యంలో, పీఆర్సీ కమిటీ నివేదికపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు (Government Employees Association) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కమిటీ నివేదికలో మూలవేతనంపై కేవలం 7.5 శాతం మాత్రమే ఫిట్ మెంట్ ప్రతిపాదించడం పట్ల ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై సెక్రటేరియట్ ముందు ఆందోళనకు ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. బీఆర్కే భవన్ ఎదుట పీఆర్సీ ప్రతులు దహనం చేయాలని నిర్ణయించారు.

తెలంగాణలో ప్రభుత్వ టీచర్ ఆత్మహత్య, ఇంటి నిర్మాణం కోసం డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో పురుగుల మందు తాగిన అనిల్‌కుమార్‌, భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సిద్దిపేట ఎస్సై

ఉద్యోగులకు ఫిట్ మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు బిశ్వాల్ కమిటీ రిపోర్ట్‌తో ఉసూరు మనిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు బిశ్వాల్ కమిటీ పని చేసిందా.. కమిటీని స్వతంత్రంగా పని చేయనిచ్చారా అని ప్రశ్నించారు. 7.5 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు ఒక కమిటీ వేయలా అన్నారు. ఉద్యోగులను నమ్మించడానికే బిశ్వాల్ కమిటీ వేసి కమిటీపై ఒత్తిడి పెంచి రిపోర్ట్ రాయించారని పేర్కొన్నారు.